నయా సైబర్‌ క్రైం.. డీప్‌ ఫేక్‌!

Deep fake is a new emerging in cyber crime - Sakshi

డార్క్‌ వెబ్‌తో పాటు సోషల్‌ మీడియా ఖాతాల్లో నుంచే ఫొటోలు, ఆడియో, వీడియోల చౌర్యం 

వాటితో సింథసిస్‌ సాఫ్ట్‌వేర్స్‌తో నకిలీవీడియోలు రూపొందిస్తున్న ఈ–నేరగాళ్ళు 

టార్గెట్‌ చేసిన వారికి బెదిరింపులు 

ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్తున్నసందర్భాలు ఎన్నో.. 

సోషల్‌ మీడియాలో ఫొటోలు, ఆడియో, వీడియోలు  విరివిగా పోస్ట్‌ చేస్తుంటారా..  అయితే జరభద్రం..  సైబర్‌ నేరాల్లో కొత్తగా పుట్టుకొచ్చిన డీప్‌ ఫేక్‌ గురించి మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..  

వీడియోలో మీ ముఖమే కనిపిస్తూ ఉంటుంది... కానీ అది మీరు కాదు. ఆడియోలో మీ మాటలే వినిపిస్తూ ఉంటాయి... కానీ మాట్లాడేదీ మీరు కాదు. మీరు చేయని అభ్యంతరకరమైన పనులు కూడా మీరే చేసినట్లు మారుస్తారు.. ఎలాగంటే.. మీ వాయిస్, వీడియో, ఫొటోలను వినియోగించి అశ్లీల వీడియోలతో సింథసిస్‌ చేసి  మీరే వీడియో కాల్‌ చేసినట్లు సృష్టిస్తారు.

లేదంటే కిడ్నాప్‌ అయ్యాననో, అత్యవసరమనో మీ ఫేక్‌ వీడియోలు సృష్టించి వాటిలో చెప్పిస్తారు.  ఆ వీడియోలను కుటుంబీకులకు చూపించి అందినకాడికి దండుకుంటారు. ఈ నేరాలు ఘోరాలు చేసేందుకు అవసరమైన ఫోన్‌ నంబర్లు, వివరాలన్నీ తెలుసుకునేందుకు నేరగాళ్లు పెద్ద కష్టపడక్కర లేదు.. కేవలం మన  సోషల్‌ మీడియా ఖాతాల నుంచే సంగ్రహిస్తున్నారు..  

సాక్షి, హైదరాబాద్‌: ఆడియో–వీడియో సింథసిస్‌ ప్రక్రియ ద్వారా జరుగుతున్న సరికొత్త సైబర్‌ నేరమే డీప్‌ ఫేక్‌. ఈ నయా తరహా సైబర్‌ నేరాలు పాల్పడేందుకు నేరగాళ్ళకు అవసరమైన డేటా డార్క్‌ వెబ్‌తో పాటు సోషల్‌ మీడియాలో తేలిగ్గా లభిస్తోంది.

సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన ఫొటోలు, ఆడియో, వీడియోలను సంగ్రహిస్తున్న ఈ–కేటుగాళ్ళు వాటిని సేకరిస్తున్నారు. డార్క్‌ వెబ్‌ సహా ఇంటర్‌నెట్‌ నుంచి ఖరీదు చేసిన టూల్స్‌ వినియోగించి సింథసిస్‌ ప్రక్రియ చేయడుతున్నారు. ఇది కేవలం నేరగాళ్ళు మాత్రమే కాదు... సాంకేతికతపై పట్టున్న వాళ్లు కూడా చేస్తున్న వ్యవహారం కావడం ఆందోళన కలిగించే అంశం.

ఈ నయా సైబర్‌ క్రైం డీప్‌ ఫేక్‌తో బాధితులు ఆర్థికంగా నష్టపోవడమే కాదు... కొన్ని సందర్భాల్లో పరిస్థితి ఆత్మహత్యలు చేసుకునే వరకు వెళుతోంది. యువతీ యువకులతో పాటు మధ్య వయస్సుల్లో జరుగుతున్న ‘కారణం తెలియని’ సూసైడ్స్‌కి ఈ సింథసిస్‌ ప్రక్రియ కూడా ఓ కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

బ్లాంక్‌ వీడియో కాల్స్‌తో...  సెక్సార్షన్‌ నుంచి ఎక్సార్షన్‌ వరకు వినియోగం... 
ఇటీవల కాలంలో అనేకమందికి వర్చువల్‌ నంబర్ల నుంచి బ్లాంక్‌ వీడియో కాల్స్‌ వస్తున్నాయి. వీటిని స్పందించి ఫోన్‌ ఎత్తితే.. అవతలి వారు కనిపించరు, మాట్లాడరు. ఎవరు కాల్‌ చేశారో  తెలుసుకోవడానికి కొద్దిసేపు ఫోన్‌లో ప్రశ్నిస్తుంటాం. ఆ సమయంలో సైబర్‌ నేరగాళ్ళు రిసీవర్‌ వీడియో రికార్డు చేస్తారు. దీన్ని అశ్లీల వీడియోలతో సింథసిస్‌ చేసి వాళ్ళే ఆ వీడియోలో ఉన్నట్లు రూపొందిస్తారు. ఈ వీడియోను చూపించి బాధితుడిని భయపెట్టి వీలున్నంత దండుకుంటారు. ప్రధానంగా యువకులు, మధ్య వయసు్కలే ఈ నేరంలో టార్గెట్‌గా మారుతున్నారు. 

నేరగాళ్ళే కాదు అవసరార్థులూ వాడేస్తున్నారు..
ఈ సింథసిస్‌ ప్రక్రియను సైబర్‌ నేరగాళ్ళతో పాటు మరికొందరూ వాడేస్తున్నారు. ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలకు హాజరయ్యే యువత కూడా సింథసిస్‌ టెక్నిక్‌ వాడి అడ్డదారిలో గట్టెక్కుతోంది. బ్యాంకులు, ఇతర సంస్థలకు వీడియో అథెంటికేషన్‌ చేయాల్సిన వచ్చినప్పుడూ ఈ ప్రక్రియ వాడుతున్నారు.

ఈ కారణంగానే ఇటీవల కార్పొరేట్‌ సంస్థలు ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలను రికార్డు చేస్తూ, అభ్యర్థిని హెచ్‌ఆర్‌కు పిలిచి పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇక బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థల్ని మోసం చేయడానికి వీడియో సింథసిస్‌ వినియోగిస్తున్నట్లు సైబర్‌ నిపుణులు చెబుతున్నారు. 

భర్త గొంతును రికార్డు చేసి.. వేధిస్తున్నట్టు మార్చి... 
మనస్పర్ధల నేపథ్యంలో తన భర్తపై ఫిర్యాదు చేయాలని భావించిన ఓ భార్య వాయిస్‌ సింథసిస్‌ టెక్నిక్‌ వాడారు. తన భర్త గొంతును రికార్డు చేసి తనను దూషిస్తున్నట్లు, వేధిస్తున్నట్లు మార్చేశారు. ఆ రికార్డునే ఆధారంగా చూపించి భర్తపై ఆరోపణలు చేశారు. అయ్యో తాను అసలు అట్లా మాట్లాడలేదంటూ భర్త గోడువెళ్లబోసుకోవడంతో కౌన్సెలింగ్‌ చేసిన పెద్దల విచారణలో అసలు విషయం బయటపడింది. 

ఆ వీడియోలు చూడగానేతొందరపడొద్దు..
ఈ సింథసిస్‌ ప్రక్రియను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ల్లోనూ పూర్తి స్థాయిలో నిర్థారించడం సాధ్యం కావట్లేదు. కొన్ని అభ్యంతరకర అంశాలకు సంబంధించి తమ వారికి సంబంధించిన వీడియోలు, ఆడియోలను చూసిన కుటుంబీకులు తొందర పడకూడదు.

అవి ఆడియో–వీడియో సింథసిస్‌ ప్రక్రియ ద్వారా తయారయ్యాయేమోనని అనుమానించాలి. బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ను వర్తింపజేయాలి. బాధితులుగా మారిన వారికి దన్నుగా ఉంటే ఒంటరితనం, కుంగిపోవడం జరగక ఆత్మహత్యలు వంటి వాటికి ఆస్కారం ఉండదు.       – పెండ్యాల కృష్ణశాస్త్రి, సైబర్‌ నిపుణుడు 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top