రెండో పెళ్లి చేయడంలేదని తల్లిని చంపాడు

Crime News: Son Killed His Mother In Kamareddy District - Sakshi

మద్నూర్‌: రెండోపెళ్లి చేయడంలేదనే కోపంతో తల్లినే నరికిచంపాడు ఓ దుర్మార్గుడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండలం మొగా గ్రామంలో చోటుచేసుకుంది. మొగ గ్రామానికి చెందిన పింజరి ఇస్మాయిల్‌ బీ(55), మహబూబ్‌సాబ్‌ దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు అల్లావుద్దీన్‌ గ్రామంలో వేరే ఇంట్లో భార్య, పిల్లల తో కలిసి ఉంటున్నాడు. చిన్న కొడుకు సల్లావుద్దీన్‌ తో తల్లిదండ్రులు ఇస్మాయిల్‌ బీ, మహబూబ్‌ సాబ్‌ కలిసి ఉంటున్నారు.

ఎనిమిదేళ్ల క్రితం సల్లా వుద్దీన్‌కు వివాహం జరగగా, రెండేళ్ల క్రితం భార్య గుండెపోటుతో మరణించింది. ఆ తర్వాత అతడు హైదరాబాద్‌లోని ఫంక్షన్‌ హాల్‌లో కొంతకాలం కూలిపని చేశాడు. రెండు నెలలుగా అతడు గ్రామంలోనే ఉంటూ ఇంటి నిర్మాణపనులకు దినసరికూలిగా వెళ్తున్నాడు. ఈ క్రమంలో నిత్యం మద్యం సేవించి వచ్చి తల్లిదండ్రులతో గొడవపడేవాడు. పెళ్లి విషయమై బుధవారం సాయంత్రం తల్లితో మరోసారి గొడవపడి బయటికి వెళ్లాడు. అర్ధరాత్రి అతిగా మద్యం తాగి ఇంటికి వచ్చి నిద్రిస్తున్న తల్లి మెడపై గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఆ సమయంలో తండ్రి మరో గదిలో నిద్రపోతున్నాడు.

దొంగలు హత్య చేశారంటూ...: తల్లిని హత్య చేసిన తర్వాత సల్లావుద్దీన్‌ భయాందోళనకు గురయ్యాడు. హత్య కేసు తనపైకి రాకుండా ఉండేందుకు పథకం వేశాడు. తల్లిని దొంగలు హత్య చేసి పారిపోయారంటూ గట్టిగా అరుస్తూ రోదించాడు. తండ్రి వద్దకు వెళ్లి గుర్తుతెలియని వ్య క్తులు అమ్మను హత్య చేసి పారిపోయారని చెప్పా డు. దీంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.

తన తల్లిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారని పోలీసుల ఎదుట సల్లావుద్దీన్‌ వాపోయాడు. పోలీసులు అనుమానంతో అతడిని విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. గురువారం బిచ్కుంద సీఐ కృష్ణ, క్లూస్‌టీం సభ్యులు ఘటనాస్థలం వద్ద వేలిముద్రలు సేకరించారు. కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top