టీటీడీపై నిరాధార ఆరోపణలు చేసిన ఇద్దరిపై కేసులు

Cases against two who made baseless allegations against TTD - Sakshi

టీటీడీ వింగ్‌ ఏవీఎస్వో ఫిర్యాదు మేరకు నమోదు

తిరుమల: టీటీడీపై నిరాధార ఆరోపణలు ప్రతిష్టను దెబ్బతీశారంటూ టీటీడీ విజిలెన్స్‌ వింగ్‌ అధికారి ఫిర్యాదు మేరకు సోమవారం పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. తిరుమల టూ టౌన్‌ ఏఎస్‌ఐ ఎం.వెంకటముని తెలిపిన వివరాలు.. తిరుపతిలో నివాసముంటున్న పి.నవీన్‌కుమార్‌రెడ్డి టీటీడీ స్పెసిఫైడ్‌ అథారిటీపై ఓ నిరాధారమైన నకిలీ వార్తను సోషల్‌ మీడియాలో, తన వ్యక్తిగత ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు. తద్వారా టీటీడీ ప్రతిష్టను, శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశాడు. దీనిపై టీటీడీ విజిలెన్స్‌ వింగ్‌ ఏవీఎస్వో ఎస్‌.పద్మనాభన్‌ తిరుమల టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదుచేశారు. సదరు ఫిర్యాదుపై న్యాయస్థానం అనుమతి తీసుకుని నవీన్‌కుమార్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. 

ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసినందుకు..
టీటీడీ ఇటీవల లడ్డూ కౌంటర్ల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు కేటాయించడంపై జెమినీ న్యూస్‌ ఆన్‌లైన్‌.కామ్‌ ఎడిటర్‌.. టీటీడీ అధికారులు ముడుపులు తీసుకున్నట్టు నిరాధార ఆరోపణలు చేశారని టీటీడీ విజిలెన్స్‌ వింగ్‌ ఏవీఎస్వో పద్మనాభన్‌ తిరుమల టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీటీడీ అధికారులు ప్రతిష్ట దిగజార్చడంతో పాటు, ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీశారని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై న్యాయస్థానం అనుమతితో ఆ ఎడిటర్‌పై కేసు నమోదు చేసినట్టు తిరుమల టూటౌన్‌ ఎస్‌ఐ సాయినాథ్‌చౌదరి చెప్పారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top