అక్కా తమ్ముళ్ల ఘరానా మోసం.. ఇక్కడ కాజేసి దుబాయ్‌లో వ్యాపారం

Brother And Sister Caught Police For Fixed Deposit Scam Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తమ సంస్థలో ఫిక్సిడ్‌ డిపాజిట్‌ చేస్తే నెలకు 5 శాతం చొప్పున వడ్డీ చెల్లిస్తామంటూ ఎర వేసిన నేరగాళ్లు నగరవాసులను నిండా ముంచారు. అద్వైత్‌ గ్లోబల్‌ బిజినెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో ఈ దందా సాగించిన సూత్రధారి దాదాపు 100 మంది నుంచి రూ.కోట్లలో కాజేశాడు. ఆ మొత్తంతో దుబాయ్‌ పారిపోయిన అతగాడు అక్కడో వ్యాపారం ప్రారంభించాడు. అతడికి సహకరించిన సమీప బంధువులైన అక్కా తమ్ముళ్లు గుట్టుచప్పుడు కాకుండా దుబాయ్‌ పారిపోయే ప్రయత్నాల్లో ఉండగా సీసీఎస్‌ పోలీసులు పట్టుకున్నారు.  
► నగరానికి చెందిన కరీముల్లా షేక్, ఇతడికి కూతురు వరుసయ్యే స్వాతి నాగప్ప, ఈమె తమ్ముడు ఆహ్లాద్‌ నాగప్ప కలిసి కొన్నేళ్ల క్రితం బంజారాహిల్స్‌లో అధ్వైత్‌ గ్లోబల్‌ బిజినెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు.  

అధిక వడ్డీ ఆశచూపి... 
► తాము దేశ వ్యాప్తంగా వివిధ రకాలైన వ్యాపారాలు చేస్తామంటూ నమ్మించారు. తమ వ్యాపారాల్లో పెట్టుబడుల కోసం తమ వద్ద ఫిక్సిడ్‌ డిపాజిట్లు చేయాలంటూ అనేక మందికి ఎర వేశారు. అలా ఇన్వెస్ట్‌ చేసిన డబ్బుతో తమ వ్యాపారాన్ని విస్తరించడంతో పాటు అందులో వచ్చిన లాభాల ఆధారంగా నెలకు 5 శాతం వడ్డీ చెల్లిస్తామంటూ ప్రచారం చేసుకున్నారు.  
► వీరి మాటలు నమ్మిన అనేక మంది అమాయకులు ఫిక్సిడ్‌ డిపాజిట్లు చేయడానికి ముందుకు వచ్చారు. ఒక్కోక్కరి నుంచి కనిష్టంగా 3 నెలల నుంచి గరిష్టంగా ఏడాది కాలానికి ఎఫ్‌డీలు చేయించుకున్నారు. వడ్డీ మొత్తాన్ని ప్రతి మూడు నెలలకు ఒకసారి చెల్లిస్తామంటూ ఒప్పందాలు కుదుర్చుకున్నారు.  
►  తొలినాళ్లల్లో కొందరికి సక్రమంగా వడ్డీ చెల్లించిన ఈ త్రయం నమ్మకం పెంచుకుంది. దీంతో అనేకమంది తమ వద్ద ఉన్నదాంతో పాటు దాచుకున్నదీ తీసుకువచ్చి వీరి వద్ద ఎఫ్‌డీలు చేశారు.  
►  సిటీకి చెందిన ఓ వివాహిత భర్త మర్చంట్‌ నేవీలో పని చేస్తున్నారు. కుటుంబం కోసం అహర్నిశలు కష్టపడుతున్న ఈయన ఏడాది లో 9 నెలలు విదేశాల్లోనే, ఓడల్లో ఉంటారు. దాదాపు పదేళ్ల పాటు కష్టపడి సంపాదించుకున్న మొత్తం రూ.4.5 కోట్లు తన భార్య ద్వారా ‘అద్వైత్‌’లో పెట్టుబడి పెట్టారు.  
►  ఇలా అనేక మంది నుంచి దాదాపు రూ.50 కోట్ల వరకు వసూలు చేసిన కరీముల్లా ఆ మొత్తం తీసుకుని గతేడాది దుబాయ్‌ పారిపోయాడు. అక్కడ ఈ డబ్బుతో ఓ వ్యాపారం ప్రారంభించాడు. – వడ్డీలు, అసలు రాకపోవడంతో తాము మోసపోయామని భావించిన ఏడుగురు బాధితులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.  

నిఘా వేసి..ఇద్దరి అరెస్టు 
►  ‘ఎఫ్‌’ డివిజన్‌ ఎస్సై ప్రవీణ్‌కుమార్‌ ఈ కేసు దర్యాప్తు చేశారు. తమ ఇంటిని వదిలి నగరంలోనే వేర్వేరు ప్రాంతాల్లో తలదాచుకున్న స్వాతి, అహ్లాద్‌ల ఆచూకీ కోసం నిఘా వేసి ఉంచారు. ఈ నేపథ్యంలోనే వీళ్లిద్దరూ కూడా దుబాయ్‌లోని బాబాయ్‌ వద్దకు పారిపోవాలని ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు.  
►  తొలుత తాను దుబాయ్‌ వెళ్లాలని భావించిన స్వాతి ఫ్లైట్‌ టిక్కెట్‌ కూడా బుక్‌ చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న సీసీఎస్‌ పోలీసులు వలపన్ని ఇద్దరినీ అరెస్టు చేశారు. పరారీలో ఉన్న కరీముల్లా కోసం అని అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడ రేవులకు లుక్‌ ఔట్‌ సర్క్యులర్‌ జారీ చేయాలని నిర్ణయించారు.

చదవండి: సీజ్‌ చేసిన..  తుపాకులెలా వాడారు?

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top