లేని ఆస్తులు చూపించి బ్యాంక్‌ లోన్‌ కొట్టేశారు

Bank Loan Fraud By Showing Non Existent Assets In Hyderabad - Sakshi

పేపర్‌ రీ సైక్లింగ్‌ పేర రూ.19.16 కోట్లు స్వాహా

యూనియన్‌ బ్యాంక్‌ నుంచి లోన్‌ పొందిన అమెజాన్‌ ఎంటర్‌ప్రైజెస్‌

సాక్షి, హైదరాబాద్‌: వేస్ట్‌ పేపర్‌ రీ సైక్లింగ్‌ పేరుతో ఓ కంపెనీ యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆంధ్రాబ్యాంక్‌)కు రూ.19.16 కోట్లు స్వాహా చేసింది. పేపర్‌ కట్టింగ్‌ యంత్రాలు, ఫ్యాక్టరీ గోడౌన్, స్టాక్, లే అవుట్‌ ప్లాట్లు.. ఇలాంటివి లేనివి ఉన్నట్లు డాక్యుమెంట్లలో చూపించి ఆంధ్రాబ్యాంక్‌ అమీర్‌పేట్‌ బ్రాంచ్‌కు ఈ మొత్తం ఎగనామం పెట్టింది. బ్యాంక్‌ అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ డి.అపర్ణారెడ్డి ఫిర్యాదు మేరకు అమెజాన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కంపెనీపై సీబీఐ గురువారం కేసు నమోదు చేసింది. ఆ వివరాల మేరకు.. అమీర్‌పేటకు చెందిన మన్నెపల్లి కమల్‌నాథ్‌ ఎండీగా, కొండపల్లి రాధాకృష్ణ డైరెక్టర్‌గా అమెజాన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో కంపెనీ ఏర్పాటుచేశారు.

వేస్ట్‌ పేపర్‌ రీ సైక్లింగ్‌ వ్యాపారానికి లోన్‌ కోసమంటూ అమీర్‌పేట్‌లోని అప్పటి ఆంధ్రాబ్యాంక్‌(ప్రస్తుతం యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) చీఫ్‌ మేనేజర్‌ కట్రోత్‌ గోవింద్‌ను కలిశారు. తమకు పెద్ద పేపర్‌ కట్టింగ్‌ మిషన్, వేస్టేజ్‌ రీ సైక్లింగ్‌ ఉందని చెప్పి రుణం కోసం దరఖాస్తు చేశారు. అమెజాన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ ప్రతినిధులు ఇచ్చిన యంత్రాల వివరాలు, గోడౌన్‌ వివరాలు, కొలట్రాల్‌ కింద ఇచ్చిన ఏడు ఖాళీ స్థలాల డాక్యుమెంట్లు చూసి రూ.19.16 కోట్ల రుణాన్ని గోవింద్‌ మంజూరుచేశారు. అయితే ఈ రుణ మంజూరులో సంస్థ చెప్పినట్లు యంత్రాలు, గోడౌన్, ఫ్లాట్లు, ఇతర ఆస్తులు గుర్తించి వాటిని లెక్కగట్టాల్సిన వ్యాలువర్‌ కటకం నర్సింహం, లీగల్‌ ఓపినియన్‌ ఇవ్వాల్సిన బ్యాంక్‌ అడ్వొకేట్‌ శ్రీనివాస్‌ప్రసాద్‌ తప్పుడు నివేదిక ఇచ్చారు.

గోవింద్‌ చెప్పినట్లు నర్సింహం, శ్రీనివాసప్రసాద్‌ ఎలాంటి క్షేత్రస్థాయి పరీశీలన చేయకుండానే సంస్థకు అనుకూలంగా నివేదికలిచ్చారు. దీంతో అమీర్‌పేట్‌ బ్రాంచ్‌ నుంచి రూ.19.16 కోట్ల మేర అమెజాన్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ సంస్థ రుణం పొందింది. రుణం పొంది ఏడాది గడిచినా చిల్లి గవ్వ కూడా తిరిగి కట్టకపోవడంతో విజిలెన్స్‌ విభాగం రంగంలోకి దిగింది. సంబంధిత కంపెనీ ప్రతినిధులతో మేనేజర్‌ కుమ్మక్కై బ్యాంకును మోసం చేశారన్న గుట్టురట్టయింది. దీనితో గోవింద్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. లేని ఆస్తులు ఉన్నట్లు చూపించి రుణం పొందినందుకు సంబంధిత సంస్థ, దాని ప్రతినిధులపై సీబీఐకి అపర్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో ప్రాథమిక విచారణ జరిపిన హైదరాబాద్‌ సీబీఐ అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top