రాళ్లు రువ్వి.. కట్టెలతో కొట్టి.. | Attack on YSRCP workers in vegetable market auctions | Sakshi
Sakshi News home page

రాళ్లు రువ్వి.. కట్టెలతో కొట్టి..

Aug 3 2024 5:25 AM | Updated on Aug 3 2024 5:25 AM

Attack on YSRCP workers in vegetable market auctions

టీడీపీ నాయకుల దౌర్జన్యకాండ 

కర్నూలు జిల్లా ఆస్పరి మండలం బిల్లేకల్‌లో విధ్వంసం 

కూరగాయల మార్కెట్‌ వేలాల్లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి 

సీఐ, ఎస్‌ఐ, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గాయాలు 

ఆలూరు రూరల్‌/ఆస్పరి:  కర్నూలు జిల్లా ఆస్పరి మండలం బిల్లేకల్లులో దినసరి కూరగాయల మార్కెట్‌ వేలాల్లో శుక్రవారం సాయంత్రం టీడీపీ నాయకులు వంద మందికి పైగా పథకం ప్రకారం వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడి విధ్వంసం సృష్టించారు. రాళ్లు రువ్వి, కట్టెలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆస్పరి సీఐ, ఎస్‌ఐ, వైఎస్సార్‌సీపీకి చెందిన పది మంది గాయపడ్డారు. స్థానికుల కథనం మేరకు.. గ్రామ పంచాయతీ పరి«ధిలోని కూరగాయల మార్కెట్‌కు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రతి రోజు సాయంత్రం రైతులు కూరగాయలను తెచ్చి బహిరంగ వేలం నిర్వహిస్తారు. 

వేలం పాడి కూరగాయలు తీసుకుని విక్రయించుకునేందుకు వ్యాపారస్తులు వస్తుంటారు. ఈ క్రమంలో కూరగాయల మార్కెట్‌ వేలాల నిర్వహణను వైఎస్సార్‌సీపీకి చెందిన గిత్త నల్లన్న దక్కించుకుని రోజూ రైతులు తెచ్చిన కూరగాయలకు కమీషన్‌ తీసుకుని వేలాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం 5 గంటలకు ఆస్పరి మండలం బిల్లేకల్లు గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయుడు వీరేష్‌ 19 సంచుల్లో (ఒక సంచి 25 కేజీలు) తెచ్చిన కూరగాయలను విక్రయించడానికి వేలానికి ఉంచాడు. 

వైఎస్సార్‌సీపీ సానుభూతి పరుడు వెంకటేష్‌ సంచి రూ.390తో వేలం పాడాడు. అంతకు మించి ఎక్కువ ధర ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆగ్రహించిన వీరేష్, మరికొందరితో కలసి వెంకటేష్ పై దాడి చేశారు. అదే రోజు రాత్రి 10.30 గంటలకు వైఎస్సార్‌సీపీ హయాంలో మార్కెట్‌లో నిర్మించిన సీసీ రోడ్డుకు సంబంధించిన శిలాఫలకాన్ని సైతం ధ్వంసం చేశారు. 

రైతులెవరూ మార్కెట్‌కు రావొద్దని చాటింపు 
ఈ క్రమంలో బిల్లేకల్లు గ్రామంలోని కూరగాయల మార్కెట్‌లో వేలాలు నిర్వహించరాదని, రైతులు ఎవరూ కూరగాయలు తీసుకురావద్దని టీడీపీ వర్గీయులు శుక్రవారం ఉదయం గ్రామంలో దండోరా వేయించారు. అయినా శుక్రవారం సాయంత్రం యథా ప్రకారం మార్కెట్‌లో కూరగాయల వేలాలు ప్రారంభమయ్యాయి. 

ఈ నేపథ్యంలో టీడీపీ వర్గీయులు వీరాంజినేయులు, పెరుగోడు, మొద్దోడు, రాజశేఖర్, చిన్న వీరేష్ , వీరాంజినేయులు, విశ్వనాథ్, నాగరాజు, చెన్నకేశవులు, రామాంజినేయులు, గంగాధర్, గోపాల్‌తో పాటు మరో వంద మంది మూకుమ్మడిగా రాళ్లు, కట్టెలతో దాడి చేశారు. దీంతో వైఎస్సార్‌సీపీకి చెందిన రంగ నాయకులు ఎడమ కాలు విరగ్గా, లక్షన్న సొమ్మసిల్లి పడిపోయాడు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. 

గొడవ విషయం తెలుసుకున్న పత్తికొండ డీఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి, ఆస్పరి సీఐ హనుమంత రెడ్డి, ఎస్‌ఐ రవీంద్ర ఘటన స్థలానికి వెళ్లారు. ఇరువర్గాలను చెదర గొడుతుండగా సీఐ హనుమంతప్ప తలకు రాయి తగిలి రక్తగాయం అయ్యింది. ఎస్‌ఐకి కూడా స్వల్పంగా గాయపడ్డారు. సీఐకి ఆస్పరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స చేసి, ఆదోనిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, గ్రామంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement