మహిళలపై దాడి చేసినా పట్టించుకోరా? 

Attack on two women - Sakshi

పట్టణ నడిబొ డ్డున ఇద్దరు మహిళలపై దాడి 

కేసు నమోదు చేయకుండా నిందితులను వదిలేసిన పోలీసులు 

పని ఒత్తిడితోనే కేసు నమోదులో జాప్యం: ఎస్‌హెచ్‌ వో

బాధితులపై కూడా కేసు నమోదు చేసిన వైనం

ఆర్మూర్‌: నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణ నడి బొడ్డున టవర్‌ సర్కిల్‌లో ఇద్దరు మహిళలపై నలుగురు హత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై పోలీసుల నిర్లక్ష్యం విమర్శలపాలవుతోంది. బాధితులు ఫిర్యాదుపై కనీసంగా పట్టించుకోకపోవడం, నలుగురు నిందితులను కనీసం విచారించకుండా వదిలేయడం వివాదాస్పదమవుతోంది.  ఆర్మూర్‌ పట్టణంలోని నిజాంసాగర్‌ కెనాల్‌పై నివాసం ఉండే శివరాత్రి అరుణ, వింజ శోభ వరసకు అక్కా చెల్లెళ్లు. వీరిద్దరూ ఇళ్లలో కూలీ పనులు ముగించుకుని నడుచుకుంటూ తమ ఇళ్లకు వెళ్తుండగా వారి సామాజిక వర్గానికే చెందిన సంపంగి రమేష్, సంపంగి గణేశ్, సంపంగి బబ్లు, సంపంగి నాగమణి రాళ్లతో దాడి చేశారు.

పాత కక్షల నేపథ్యంలో జరిగిన దాడిలో అరుణ తల పగిలి రక్తం కారడంతో తల్లి యాదమ్మ సహాయంతో ఆర్మూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు పరిగెత్తుకొని వెళ్లారు. వెంటనే పోలీసులు బాధిత మహిళలిద్దరినీ చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి పంపించి ఘటనా స్థలానికి వెళ్లి దాడికి పాల్పడిన నలుగురిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారు. కానీ ఆ తర్వాత వారిని వదిలి వేయడంపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆస్పత్రిలో చికిత్స చేయించుకొని తిరిగి పోలీస్‌ స్టేషన్‌కు బాధిత మహిళలు వచ్చినా పోలీసులు పట్టించుకోలేదు.

గత రెండు రోజులుగా తిరుగుతున్నా పట్టించుకోకపోగా.. ఇదే పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఎస్సై ఏకంగా మీపైనే కేసు పెడతాం అంటూ తమనే బెదిరించారని బాధిత మహిళలు చెబుతున్నారు. ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీస్‌ అంటూ ప్రచారం చేస్తుండగా ఆర్మూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో మాత్రం నిరుపేద మహిళలపై దాడి చేసిన వారిని కేసులు పెట్టడానికి కూడా పోలీసులు మీనమేషాలు లెక్కించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

ఆలస్యంగా ఎఫ్‌ఐఆర్‌ ఎందుకంటే: సురేష్‌ బాబు, ఎస్‌హెచ్‌వో, ఆర్మూర్‌ 
’’ఆర్మూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఇతర కేసుల ఒత్తిడిలో ఇద్దరు మహిళలపై దాడి చేసిన వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం ఆలస్యం అయింది. దాడి చేసిన నలుగురిపై శుక్రవారం రాత్రి 324 సెక్షన్‌ కేసు నమోదు చేశాము. బాధిత మహిళలపై సైతం కౌంటర్‌ కేస్‌ ఫైల్‌ చేశాము.’

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top