మొత్తం 83.37 పోలింగ్ నమోదు ఓటర్లతో నిండిపోయిన పోలింగ్ కేంద్రాలు పెరిగిన పోలింగ్ శాతం 9 మండలాల్లో 177 సర్పంచ్, 1,196 వార్డులకు ఎన్నికలు ఓటు వేసిన ఓటర్లు 3,42,798 మంది మహిళా ఓటర్లు 874 మంది అధికం అత్యధికంగా పోలింగ్ బైరెడ్డిపల్లె, అల్పంగా వి.కోట మండలాలు
చిత్తూరు కార్పొరేషన్: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు గురువారం ముగిశాయి. పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో 83.37 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 9 మండలాల పరిధిలోని 182 పంచాయతీలు, 1,908 వార్డు స్థానాలకు అధికారులు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు. అందులో గంగవరం మండలంలోని చౌడిరెడ్డిపల్లె, పెద్దపంజాణిలో వీరప్పల్లె, కుప్పంలో నాయనూరు, బ్రహదేవరచేను, దేవరాజపురం పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అలాగే 712 వార్డు సభ్యుల స్థానాలు సైతం ఏకగ్రీవం చేసుకున్నారు. మిగిలిన 177 గ్రామ పంచాయతీలకు సంబంధించి 494 మంది, 1,196 వార్డు సభ్యుల స్థానాలకు 2,482 మంది పోటీలో నిలిచారు. 1,581 పోలింగ్ కేంద్రాల్లో గురువారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగింది. మొత్తం 4,11,158 మంది ఓటర్లలో 3,42,798 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 1,70,962 మంది పురుషులు, 1,71,836 మంది మహిళలు ఉన్నారు. మొత్తం పోలైన ఓట్లలో మహిళా ఓటర్ల సంఖ్య 874 అధికంగా ఉంది. అత్యధికంగా బైరెడ్డిపల్లె మండలంలో 85.94 శాతం, గుడుపల్లె 85.38 శాతం, అత్యల్పంగా వి.కోటలో 80.54 శాతం పోలింగ్ నమోదైంది.


