కుప్పం: పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారులు గెలుపొందడంతో ఆయా పంచాయతీల్లో సంబరాలు చేసుకున్నారు. రామకుప్పం మెజర్ గ్రామ పంచాయతీలో వైఎస్సార్ సీపీ మద్దతుదారుడు తన్హీర్ బాషా 599 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు బాణసంచా పేల్చి, పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అలాగే నారాయణపురం తాండ పంచాయతీలో చక్రి నాయక్, బళ్ల గ్రామ పంచాయతీలో హస్మాఆలీ, కెంచనబళ్ల గ్రామ పంచాయతీలో సురేఖ చంద్రప్ప విజయం సాధించగా.. ఆయా పంచాయతీల ప్రజలు సంబరాల్లో మునిగితేలారు. ఇక గుడుపల్లె మండలంలో నాలుగు పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు సర్పంచ్‌లు గెలుపొందారు. పోగురుపల్లి పంచాయతీలో సుబ్రమణ్యం, గుండ్లసాగరం, చీకటిపల్లి, ఓఎన్ కోత్తూరు గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ మద్దతు అభ్యర్థులు సర్పంచ్‌లుగా గెలుపొందారు. యువత బాణసంచా కాల్చి నృత్యాలు చేస్తూ సందడి చేశారు.


