ఇప్పటికే పలుజాతుల కనుమరుగు
క్రమంగా తగ్గిపోతున్న మరికొన్ని జాతులు
సంరక్షణకు చర్యలు తీసుకోవాలంటున్న పర్యావరణ వేత్తలు
నేటి నుంచి వన్యప్రాణుల సంరక్షణ
వారోత్సవాలు
చిత్తూరు కార్పొరేషన్: వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రభుత్వం, వైల్డ్ లైఫ్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎక్కడో ఒకచోట వేటగాళ్లు ఉచ్చు బిగించి మూగజీవాల ప్రాణాలను తోడేస్తున్నారు. ఇప్పటికే కొన్ని జాతులు పూర్తిగా కనుమరుగు కాగా, మరికొన్ని అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించేందుకు ప్రతిఏటా అక్టోబర్ 2 నుంచి 8వ తేదీ వరకు అటవీశాఖ ఆధ్వర్యంలో వన్యప్రాణి వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. జంతువులను ప్రతిఒక్కరూ ఆదరించాలని, వాటిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని వైల్డ్ లైఫ్ అధికారులు చెబుతున్నారు.
1.75 లక్షల హెక్టార్లలో అటవీ ప్రాంతం
చిత్తూరు జిల్లాలో 1.75 లక్షల హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ముఖ్యంగా పలమనేరు, కుప్పం, చిత్తూరు, పూతలపట్టు, గుడిపాల, పెనుమూరు, జీడీనెల్లూరు, పాలసముద్రం, ఎస్‌ఆర్‌పురం ప్రాంతాల్లో అడవులు ఉన్నాయి. వీటిలో సింహాలు మినహా అన్ని రకాల జంతువులు ఉన్నాయి. ప్రధానంగా ఏనుగులు, హైనాలు, ఎలుగుబంట్లు, జింకలు, నెమళ్లు, దేవాంగపిల్లి, దుప్పి, తోడేళ్లు, నక్కలు, అడవి కుందేళ్లు, పావురాలు, కోళ్లు, కొండచిలువలు, అటవిపిల్లి, వేటకుక్కలు, తాచుపాము, నీళ్లపాము, తాబేలు వంటి 50 రకాల జాతుల జంతువులు ఉన్నట్లు అటవీశాఖ అఽధికారులు గుర్తించారు.
357.62 చదరపు కిలోమీటర్ల కౌండిన్య
కౌండిన్య అభయారణ్యం 357.62 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. చిత్తూరు, పలమనేరు, కుప్పం, పుంగనూరు రేంజ్‌లను కలిపి రాయల్ ఎలిఫెంట్ రేంజ్‌గా పిలుస్తారు. కుప్పం రేంజ్ నుంచి పలమనేరు వరకు కౌండిన్య అటవీ ప్రాంతంలో వన్యప్రాణి జంతువులు ఎక్కువగా ఉన్నట్లు అదికారులు గుర్తించారు. 2018లో జంతు గణన చేపట్టి జంతువుల కదలికలను గుర్తించారు. ఆ తర్వాత 2022 జనవరిలోనూ మరోసారి జంతుగణన చేపట్టారు. ఇక్కడ ఏనుగులతోపాటు ఇతర జంతువులు కూడా ఉన్నట్టు గుర్తించారు. వాటి సంరక్షణ కోసం బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రత్యేక గస్తీ చేపట్టారు.
కౌండిన్య అటవీ ప్రాంతం
పచ్చటి చెట్ల నీడన ప్రశాంతంగా విహరించాల్సిన మూగజీవాల గుండెల్లో తూటాల భయం నిద్రపోనివ్వడం లేదు. ప్రభుత్వాలు కోట్లు కుమ్మరించి రక్షణ ప్రణాళికలు రచిస్తున్నా, అటవీ సరిహద్దుల్లో నిఘా కళ్లు కప్పి వేటగాళ్లు ఉచ్చు బిగిస్తూనే ఉన్నారు. ఒకవైపు అరుదైన వన్యప్రాణి జాతులు అంతరించిపోతుండగా, మరోవైపు ఉన్నవాటి సంఖ్య రోజురోజుకూ ప్రమాదకర స్థాయికి పడిపోతోంది. అటవీ సంపదను, జీవవైవిధ్యాన్ని కాపాడాలిసన బాధ్యతను గుర్తు చేస్తూ నేటి నుంచి వన్యప్రాణుల వారోత్సవాలు మొదలవుతున్న వేళ.. ఈ వేడుకలు ప్రచార ఆర్భాటానికే పరిమితం కాకుండా మూగ జీవాల ప్రాణాలకు నిజమైన రక్షణ కవచాన్ని నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సంరక్షిద్దాం
అరణ్యంలో జీవించే వన్యప్రాణులకు మనుషులంటే భయం. వన్యప్రాణుల సంరక్షణ కోసం చట్టాలు తీసుకొస్తున్నప్పటికీ ఏటా మూగ జీవాల్ని వేటాడటం మానడం లేదు. ఇక ఆహారం కోసం దారి తప్పి వస్తున్న జంతువులు విద్యుత్ షాక్‌తోపాటు ప్రమాదాలకు లోనై మరణిస్తున్నాయి. అడవి ప్రాంతంలో వాహనాలు నెమ్మదిగా నడపడం అలవాటు చేసుకోవాలి. రోడ్డు దాటుతున్న జంతువులను రెచ్చగొట్టడం, శబ్దాలు చేస్తూ వాటి పైకి వాహనాలు పొనివ్వడం కూడా అటవీ జంతువుల ప్రాణాలకు ప్రమాదంలో పడేస్తున్నాయి. జంతువులను ప్రేమించి వాటి సంరక్షణపై కనీస అవగాహన ఉంటే తప్ప అడవుల్లోని జీవజాతుల్ని కాపాడుకునే పరిస్థితి ఉండదు.
వేటగాళ్ల స్వార్థానికి అంతరించిపోతున్న వన్యప్రాణులు


