పాలసముద్రం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి పేర్కొన్నారు. పార్టీ కోసం పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన నాయకులు, కార్యకర్తల కుటుంబాలను ఆదుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక అందజేయనున్నట్టు తెలిపారు. ఆయన గురువారం పాలసముద్రంలో విలేకరులతో మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే నాయకులు, కార్యకర్తలకు ఏదైనా అనుకోని ఘటన జరిగితే ఆ కుటుంబాలను పార్టీ తమ కుటుంబంగా భావించి అండగా నిలుస్తుందన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ వివిధ కమిటీల్లో నియమితులై, పార్టీ గుర్తింపు కార్డులు పొందిన నాయకులు ప్రమాదవశాత్తు మృతిచెందితే పార్టీ తరఫున రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తామని పేర్కొన్నారు. దీంతో బాధిత కుటుంబాలకు కొంతమేర భరోసా కలుగుతుందన్నారు. ఆర్థిక సహాయం పొందేందుకు పార్టీ కమిటీలో నియమితులై ఉండడంతో పాటు పార్టీ గుర్తింపు కార్డు పొంది ఉండాలన్నారు. ప్రమాదానికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్ కాపీ, పోస్టుమార్టం రిపోర్టు లేదా పంచనామా వంటి ధ్రువీకుణ పత్రాలను సమర్పించాలన్నారు. సంబంధిత గ్రామ లేదా వార్డు అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు సిఫార్సుతో ఎమ్మెల్యే లేదా అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త మృతుడి వివరాలను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాల్చి ఉంటుందని వివరించారు. అదేవిధంగా మృతుని నామినీ బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్ కార్డును తప్పనిసరిగా జత చేయాలని సూచించారు. పూర్తి వివరాలు, అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో ప్రతిపాదనలు పంపితే ఆర్థిక సహాయం అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ఈ నెల 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుంటే సంబంధిత పార్టీ నాయకులు ఆలస్యం చేయకుండా వివరాలు సేకరించి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించాలని సూచించారు. వైఎస్సార్ సీపీ గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కార్యకర్తలే ప్రధాన బలమని నారాయణస్వామి పేర్కొన్నారు. పార్టీ కమిటీల్లో ఉన్న నాయకులు, కార్యకర్తల వివరాలను ఇప్పటికే క్షేత్రస్థాయిలో సేకరించి, అవసరమైన సందర్భాల్లో బాధిత కుటుంబాలకు త్వరితగతిన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు.


