కాణిపాకం: కాణిపాక శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామిని గురువారం ఇస్రో మాజీ చైర్మన్, అంతరిక్ష పరిశోధన కమిషన్ సభ్యుడు ఏఎస్ కిరణ్‌కుమార్ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు దేవస్థానం ఏఈఓ రవీంద్రబాబు, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికి స్వామివారి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేయగా, ఏఈఓ రవీంద్రబాబు స్వామివారి శేషవస్త్రం కప్పి, చిత్రపటంతో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ బాలాజీ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
అభ్యర్థులకు
హాల్ టికెట్ల పంపిణీ
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరులోని 8వ బెటాలియన్ ఏపీఎస్పీలో వివిధ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థులకు హాల్ టికెట్లు పంపిణీ చేయనున్నట్లు బెటాలియన్ కమాండెంట్ కె.రామచంద్రమూర్తి తెలిపారు. దరఖాస్తుల పరిశీలన పూర్తి కావడంతో షార్ట్‌లిస్ట్ తయారుచేశామని వెల్లడించారు. ఆ జాబితాలోని అభ్యర్థులకు అక్టోబర్ 5, 6 తేదీల్లో హాల్ టికెట్లు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఇరువారం గ్రామంలోని జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రంలో ఉన్న కమాండెంట్ కార్యాలయంలో నేరుగా హాజరై హాల్ టికెట్లు తీసుకోవాలని సూచించారు. అభ్యర్థులు తమతో పాటు ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపారు. నిర్ణీత తేదీల్లో హాల్ టికెట్లు తీసుకోకపోతే కార్యాలయం బాధ్యత వహించదని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం 9440456433, 9703545843 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
చిత్తూరు, తిరుపతిలో
డీఎస్పీల బదిలీ
సాక్షి, చిత్తూరు: చిత్తూరు, తిరుపతి జిల్లాలో పనిచేస్తున్న పలువురు డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్ గుప్త గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. చిత్తూరు మహిళా స్టేషన్‌లో పనిచేస్తున్న శ్రీనివాసులును గుంతకల్లుకు, చంద్రగిరిలో ఉన్న బి.ప్రసాద్‌ను మదనపల్లెకు, పోస్టింగ్ కోసం వేచివున్న ఎస్.చంద్రశేఖర్‌ను నగరికి, బాపట్లలో పనిచేస్తున్న పి.జగదీష్ నాయక్‌ను చంద్రగిరికి బదిలీ చేశారు.


