చిత్తూరు రూరల్ (కాణిపాకం) : పాఠశాల విద్యార్థులకు కళ్ల జోళ్లు పంపిణీ చేసేందుకు నిర్వహించిన టెండర్ ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ టెండర్లలో గోల్‌మాల్ జరిగిందని, అర్హులైన టెండర్‌దారులను కావాలనే పక్కన పెట్టారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ఈ ఏడాది 11,739 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేయగా 1,023 మందికి, అలాగే 2025–26 సంవత్సరానికి సంబంధించి 51,047 మంది పిల్లలకు పరీక్షలు చేయగా 2,910 మందికి కంటి లోపాలున్నట్లు గుర్తించారు. అయితే వీరికి కళ్లజోళ్లు పంపిణీ చేయడంలో ఆలస్యం జరుగుతోందని సాక్షి దినపత్రికలో ఆగస్ట్ 29వ తేదీన ‘‘ఆరిపోయిన వెలుగు’’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన అధికారులు 6 నుంచి 18 ఏళ్ల పిల్లలకు కళ్ల జోళ్లు అందించేందుకు బుధవారం టెండర్ల ప్రక్రియ నిర్వహించారు.
రూపాయి తేడాతో కోట్
ఒక్కో కంటి జోడుకు గరిష్ట ధరగా రూ.280 నిర్దేశించగా, మొత్తం ఆరుగురు టెండర్‌దారులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, నలుగురు ముందస్తు ప్రణా ళికతో సిండికేట్‌గా మారి కేవలం ఒక్క రూపాయి తేడాతో (రూ.278, రూ.279, రూ.279.50) కోట్ చేశారని మిగిలిన ఇద్దరు టెండర్‌దారులు ఆరోపిస్తున్నారు. కుట్రపూరితంగా తమను పక్కన పెట్టా రని బాధితులు స్పష్టం చేస్తున్నారు. ఓ టెండర్‌దారుడు మాట్లాడుతూ తాను తమిళనాడుకు చెందిన వ్యక్తినని, అక్కడి జీఎస్టీ ఇక్కడ చెల్లదనే సాకుతో తన దరఖాస్తును రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రెండుసార్లు తనకు టెండర్ ఇచ్చిన అధికారులు, ఇప్పుడే కొత్త నిబంధనలు తెచ్చారని వాపోతున్నారు. మరో టెండర్‌దారుడు మాట్లాడుతూ డీడీ పత్రంపై సాంకేతిక సాకులు చూపి టెండర్ ప్రకియకు రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. కొందరు అధికారుల తోడ్పాటుతోనే ఈ సిండికేట్ వ్యవహారం నడిచిందని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదంపై డీఎంహెచ్‌ఓ నాగశశిభూషణ్‌రెడ్డిని వివరణ కోరగా.. టెండర్ల ప్రక్రియపై వచ్చిన ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని తెలిపారు. సంబంధిత అధికారులతో మాట్లాడి వాస్తవాలు తెలుసుకుంటానని వెల్లడించారు.


