తహసీల్దార్ కార్యాలయాల్లో వసూలు రాజాలు
దళారుల చేతిలో సర్కారు లాగిన్లు
పలుచోట్ల వీఆర్‌ఓలు దాగుడుమూతలు
అడిగినంత ఇస్తేనే పనులు
లేకుంటే వినతుల బుట్టదాఖలు
కాణిపాకం : రెవెన్యూ కార్యాలయాలు ఉండేది ప్రజా సమస్యలు తీర్చేందుకా లేక, కాసులు పిండుకునేందుకా అని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూ సమస్యలు, మ్యుటేషన్లు, సర్వేల కోసం సామాన్యులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ప్రజలు ఇచ్చే వినతిపత్రాలు నేరుగా చెత్తబుట్టల్లోకే చేరుతున్నాయి. క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాల్సిన వీఆర్‌ఓలు, సర్వేయర్లు పలు చోట్ల వ్యక్తిగత పనుల్లో నిమగ్నమవుతూ కంటికి కనిపించకుండా దాగుడుమూతలు ఆడుతున్నారు. పర్యవేక్షించే అధికారులు స్పందించకపోవడంతో రెవెన్యూ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మధ్యవర్తులతో దందా!
పూతలపట్టు నియోజకవర్గంలో ఐదు తహసీల్దార్ కార్యాలయాలున్నాయి. ఈ ఆఫీస్‌లకు రోజూ వివిధ పనుల నిమిత్తం వందలాది మంది వస్తుంటారు. ప్రధానంగా బంగారుపాళ్యం, ఐరాల, యాదమరి, తవణంపల్లి తహసీల్దార్ కార్యాలయాలకు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ కార్యాలయాల్లో కొన్ని అక్రమాలకు అడ్డాగా మారిపోయాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ముడుపులు ఇవ్వందే ఫైళ్లు కదలండంలేదని ఆవేదన చెందుతున్నారు. చాలామంది రెవెన్యూ సిబ్బందికి కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోవడంతో మధ్యవర్తులను పెట్టుకునిగా వసూళ్ల దందా నడుపుతున్నారని మండిపడుతున్నారు.
అంగట్లో సర్కారు లాగిన్లు
అక్రమాలు ఏ స్థాయిలో సాగుతున్నాయంటే.. యాదమరి తహసీల్దార్ కార్యాలయం సమీపంలోనే కొందరు రెవెన్యూ అధికారుల ప్రభుత్వ లాగిన్ ఐడీలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి చేరిపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారిక లాగిన్లను దళారులకు అప్పగించి బహిరంగంగానే కాసులు గుంజుతున్నారని వెల్లడిస్తున్నారు. ఐరాల మండలంలో వన్ బీ, భూ మార్పులు, భాగ పరిష్కారాలు, సర్వే దరఖాస్తుల విషయంలో భూ యజమానులకు నరకం చూపిస్తున్నారని వాపోతున్నారు. బంగారుపాళ్యంలో అయితే కొందరు వీఆర్‌ఓలు పనులు చేయకపోగా.. తిప్పించుకుంటున్నారని, ఇదేమని అడిగితే దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ నేతల కన్నుసన్నల్లోనే..?
టీడీపీ నేతల కన్నుసన్నల్లో, వారి సిఫార్సులతోనే తహసీల్ధార్ కార్యాలయాల్లో పనులు జరుగుతున్నాయని స్థానికులు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. ఈ దోపిడీపై సామాన్య ప్రజలతో పాటు అధికార పార్టీలోని కొంత మంది నాయకులు కూడా మండిపడుతున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడటమే ఈ అడ్డగోలు అవినీతికి కారణమని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని రెవెన్యూ శాఖలోని అవినీతి తిమింగలాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, పారదర్శకంగా సేవలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
వసూలు పర్వం ఇలా..
భూ విలువను మేరకు రూ.5వేల నుంచి ఏకంగా రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. 22ఏ జాబితా నుంచి భూములను తొలగించి ఆన్‌న్‌లైన్ చేసేందుకు రూ. లక్షల్లో రేట్లు కుదుర్చుకుంటున్నారని వెల్లడిస్తున్నారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల మంజూరుకు సైతం రూ.30వేల వరకు డిమాండ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితులు ఆన్‌న్‌లైన్‌న్‌లో చలానా కట్టి దరఖాస్తు చేసుకున్నా అస్సలు పట్టించుకోవడం లేదని స్పష్టం చేస్తున్నారు. గొలుసు పట్టాలంటే రూ.10వేల నుంచి రూ.30వేల సబ్‌డివిజన్ ప్రక్రియ పూర్తి చేయాలంటే భూమి విస్తీర్ణం, విలువను బట్టి ఏకంగా రూ.3లక్షల వరకు గుంజుతున్నారని వివరిస్తున్నారు.
పూతలపట్టు నియోజకవర్గంలోని రెవెన్యూ కార్యాలయాలను కొందరు అధికారులు అవినీతికి అడ్డాగా మార్చేశారు. ప్రతి పనికీ లంచం ఇవ్వడమనేది లాంఛనంగా తయారు చేసేశారు. సమస్య పరిష్కారం కావాలంటే అడిగినంత చెల్లించాల్సిన దుస్థితిని కల్పించేశారు. మాట వినకుంటే కాళ్లరిగేలా ప్రదక్షిణలు చేసినా పట్టించుకోని పరిస్థితి తీసుకువచ్చారు. ఉన్నతాధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా నగదు వసూళ్లకు పాల్పడుతున్నారు.


