నులి నిర్మూలనతో ఆరోగ్యం | - | Sakshi
Sakshi News home page

నులి నిర్మూలనతో ఆరోగ్యం

Sep 26 2026 12:14 AM | Updated on Sep 26 2026 12:14 AM

చిత్తూరు కలెక్టరేట్‌ : నులిపురుగుల నిర్మూలనతో పిల్లలకు ఆరోగ్యం, ఏకాగ్రత లభిస్తుందని డీఈఓ లక్ష్మీనారాయణ, డీఎంహెచ్‌ఓ శశిభూషణ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం డీఈఓ కార్యాలయం పక్కనున్న ప్రభుత్వ పాఠశాలలో జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులకు ఆల్బెండజోల్‌–400 మాత్రలను మింగించి అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ 1 నుంచి 19 ఏళ్ల బాల బాలికలందరికీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచితంగా అల్బెండజోల్‌ 400 ఎంజీ మాత్రలను అందజేస్తున్నామన్నారు. అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అనంతరం మాత్రలను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,10,910 మంది బాలబాలికలకు మాత్రలను వేయించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 2102 అంగన్‌వాడీ కేంద్రాల్లో 1 నుంచి 2 ఏళ్ల పిల్లలు (63,963 మంది)కి అర మాత్ర, 2 నుంచి 5 ఏళ్ల పిల్లలకు ఒక పూర్తి మాత్ర అందజేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని 2,248 పాఠశాలలు, కళాశాలల్లో 6 నుంచి 19 ఏళ్ల విద్యార్థులు (2,09,245 మంది) విద్యార్థులకు ఒక మాత్ర అందజేస్తున్నట్లు చెప్పారు. కడుపులో నులిపురుగులు ఉంటే పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి మందగించడం, నీరసం, చదువుపై ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు వస్తాయని తెలిపారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి అల్బెండజోల్‌ మాత్ర వేసుకోవడం వల్ల పోషకాల గ్రహణశక్తి, నేర్చుకునే సామర్థ్యం పెరుగుతాయని వివరించారు. విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. గోళ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా, చిన్నవిగా ఉంచుకోవాలని సూచించారు. ఆహారం తినే ముందు, మల విసర్జన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని తెలిపారు. కల్తీ లేని, శుభ్రమైన తాగునీటినే వినియోగించాలని కోరారు. కార్యక్రమంలో డీవైఈవో ఇందిర, ఆర్‌బీఎస్‌కే రాష్ట్ర అబ్జర్వర్‌ వినోద్‌, జిల్లా ఆర్‌బీఎస్‌కే కో–ఆర్డినేటర్‌ గిరి, నగరపాలక సంస్థ హెల్త్‌ ఆఫీసర్‌ అనిల్‌కుమార్‌, ఎంఈఓలు సెల్వరాజ్‌, మోహన్‌, హసన్‌బాషా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement