సాక్షి, చిత్తూరు : జిల్లాలో కొత్త పింఛన్ల కోసం 43 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో డప్పు కళాకారుల పేరిట 2,970 దరఖాస్తులు అందాయి. కానీ, జిల్లాలో ఇంత మంది లేరని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. టీడీపీకి చెందిన కార్యకర్తలకు డప్పు కళాకారుల వేషం వేసి, తప్పుడు సర్టిఫికెట్లతో ఆ కేటగిరీ నుంచి కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేయించారు. ఇక ఆధార్ కార్డులో మార్పులు చేసి వృద్ధాప్య పింఛన్ కోసం 2 వేలకు పైగా టీడీపీ కార్యకర్తల డేటా ఆన్‌లైన్‌లో నమోదైనట్లు తెలుస్తోంది. ఓవైపు కార్యకర్తలకు నెలవారీ ఆదాయం ఇప్పించడం కోసం ఆయా కేటగిరీ వేషాలు వేయిస్తున్న టీడీపీ నేతలు.. ఇదే సమయంలో అర్హుల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. కొత్త పింఛన్ల కోసం ఎవరెవరు దరఖాస్తు చేసుకున్నారనే డేటాను తెప్పించుకున్న కొందరు నాయకులు, వారి ఇళ్ల వద్దకే వెళ్లి మరీ బేరసారాలు సాగిస్తున్నారు. ఒక్కో పింఛన్ మంజూరుకు కనిష్టంగా రూ.10 వేల నుంచి గరిష్టంగా రూ.30 వేల వరకు డిమాండ్ చేస్తున్నారు.
అధికారులపై పెరుగుతున్న ఒత్తిడి
ఇక పింఛన్ల మంజూరు కోసం అధికారుల గొంతుపై ప్రజా ప్రతినిధులు కత్తిపెడుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 13 వేల దరఖాస్తులను ఆమోదించిన యంత్రాంగం, 30 వేల వరకు పెండింగ్‌లో ఉంచింది. తాము ఆమోదించిన పేర్లను వెంటనే అర్హుల జాబితాలోకి ఎక్కించాలని నేతలు పట్టుపడుతున్నారు. దీంతో ఎవరు అర్హులు..? ఎవరు అనర్హులు..? అనేది తేల్చుకోలేక అధికారులు సతమతమవుతున్నారు.


