కూటమి ప్రభుత్వ ప్రచారానికి ఇన్‌ఫ్లూయెన్సర్స్ సేవలు
పాలసీకి కేబినెట్‌లో సైతం ఆమోదం
రూ.25 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు చెల్లించేలా ప్లాన్
హామీలు నెరవేర్చకుండా పబ్లిసిటీ పిచ్చికి పరాకాష్ట, సర్వత్రా విమర్శలు
హామీల అమలెక్కడ బాబు ?
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ భృతి ఊసే లేదు. నిరుద్యోగ భృతి కోసం జిల్లా వ్యాప్తంగా 4.15 లక్షల మంది యువత ఎదురుచూస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 50 ఏళ్లకే పింఛను హామీ అమలు కాలేదు.ఈ హామీ కోసం జిల్లాలో 2.58 లక్షల మంది ఎదురు చూపులు చూడాల్సిన దుస్థితి. ఆడబిడ్డ నిధి కింద మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం మరిచిపోయింది.
చిత్తూరు కలెక్టరేట్ : ఎన్నికల ముందు ఇచ్చిన నెరవేర్చలేని బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు ప్రజా ధనంతో విచ్చలవిడిగా ప్రచారాలు చేసుకునేందుకు సరికొత్త నాటకానికి తెరతీసింది. సంక్షేమ పథకాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం, తమ సొంత ప్రచారానికి ‘సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్’ను నియమించుకునేందుకు విచిత్రమైన పాలసీకి శ్రీకారం చుట్టింది. పాలసీకి కేబినెట్ సైతం ఆమోదం తెలపడంపై జిల్లాలోని ప్రజలతో పాటు పలువురు మేధావులు, యువత, విద్యార్థి సంఘ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
ప్రజాధనం ఐటీడీపీ కార్యకర్తల పాలేనా?
– రూ.25 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు నజరానా
ప్రభుత్వ పథకాలు, నిర్ణయాలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసేందుకు వేల రూపాయిల ప్రజాధనాన్ని ఇన్‌ఫ్లూయెన్సర్స్‌కు పంచిపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఫాలోవర్ల సంఖ్యను బట్టి నెలకు రూ.25 వేల నుంచి ఏకంగా రూ.1.50 లక్షల వరకు చెల్లించేలా నిబంధనలు రూపొందించారు. టీడీపీ శ్రేణులకు ఈ నిధులను దోచిపెట్టేందుకు ఈ విచిత్ర పాలసీని తీసుకొచ్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రజా సమస్యలు గాలికి..
జిల్లాలో రైతులు, పేదలు, విద్యార్థులు, నిరుద్యోగులు అనేక సమస్యలతో అల్లాడుతుంటే, వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం తన సొంత డబ్బా కొట్టుకోవడం కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని సోషల్ మీడియా కార్యకర్తలకు ధారపోస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హామీలు నెరవేర్చని ప్రభుత్వం, విమర్శలను అణచివేసేందుకు, అసత్యాలను ప్రచారం చేసేందుకు ప్రజల సొమ్ముతో పబ్లిసిటీ చేయడం ఎంతవరకు సమంజసం అని మేధావి వర్గాలు, యువత, విద్యార్థి సంఘాల నాయకులు, వామపక్ష పార్టీలు సూటిగా ప్రశ్నిస్తున్నాయి.
విచిత్ర పాలసీకి తెరలేపిన చంద్రబాబు ప్రభుత్వం


