రూ.వందల కోట్ల రుణాలు ఇప్పించి
ఆపై ఆర్థిక భారం
ఎన్నికల వేళ ప్రజలను బురిడీ కొట్టించే యత్నం
ఆ 40 శాతం నిధులు కూడా
మునిసిపాలిటీలవే
భవిష్యత్తులో కాంట్రాక్టర్ల కనుమరుగు ఖాయం
సాక్షి, చిత్తూరు: హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హాం) పేరిట నాలుగు రోజుల క్రితం కుప్పంలో చంద్రబాబు వర్చువల్ విధానంలో మునిసిపాలిటీల్లో రూ.11,360 కోట్ల విలువైన పనులు చేస్తున్నట్లు శంఖుస్థాపన చేశారు. దీనివల్ల పట్టణాల రూపురేఖలు మార్చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే మాత్రం ఇది ఎన్నికల స్టంట్ తప్ప మరేమీలేదు. పైగా మునిసిపాలిటీలను అప్పుల ఊబిలో దింపడమే ఈ ‘హాం’ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
అసలు మతలబు..
‘హాం’ కింద జిల్లాలోని చిత్తూరు మునిసిపల్ కార్పొరే షన్‌కు రూ.60 కోట్లు, పలమనేరు మునిసిపాలిటీకు రూ.25 కోట్లు, నగరికి రూ.15 కోట్లు కేటాయిస్తున్నట్లు సమగ్ర ప్రాజెక్టు నివేదికలో పేర్కొన్నారు. ఇందులో 40 శాతం నిధులను ప్రభుత్వం, 60 శాతం నిధులు ప్రైవేటు డెవలపర్లు సమకూరుస్తున్నట్లు పేర్కొన్నారు. వాస్తవానికి 40 శాతం నిధులు ఆయా మునిసిపాటీలకు చెందిన డబ్బులే. భవన నిర్మాణ సమయంలో ప్రతి మునిసిపాలిటీకి ప్రజలు చెల్లించే రుసుములు పట్టణ–గ్రామీణ ప్రణాళిక సంచాలకత్మం (డీటీసీపీ) ఖాతాలో జమ అవుతుంది. ఇలా దాదాపు పదేళ్ల పాటు మునిసిపాలిటీలకు జమ కావాల్సిన భవన నిర్మాణ అనుమతి ఫీజులన్నీ డీటీసీపీ వద్ద ఉండిపోవడం, వాటిని ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకోవడం జరిగిపోయింది. తాజాగా ‘హాం’ కింద ఈ 40 శాతం నిధులు మునిసిపాలిటీలకు సమకూరుస్తూ, మిగిలిన 60 శాతం డెవలపర్లు అప్పుగా ఇవ్వనున్నారు.
కాంట్రాక్టర్లు కనుమరుగు..
ఇందులో మరో మతలబు కూడా ఉంది. ప్రైవేటు డెవలపర్ల ప్రమేయంతో మునిసిపాలిటీలో చిన్నా, చితక పనులు చేసుకుంటున్న కాంట్రాక్టర్ల ఉనికి ‘హాం’తో పూర్తిగా కనుమరుగు కానుంది. కేవలం బడా కార్పొరేట్ కంపెనీలు, పేరుమోసిన సంస్థలు మాత్రమే టెండర్లలో పాల్గొంటాయి. సామాన్య కాంట్రాక్టర్లు అంత మొత్తం పెట్టుబడులు పెట్టడం, బ్యాంకు నుంచి రూ.వందల కోట్ల రుణాలు పొందడం అసాధ్యం. ఫలితంగా రూ.పది లక్షల లోపు పనులు చేసుకునే కాంట్రాక్టర్లు భవిష్యత్తులో మునిసిపాలిటీల్లో కనిపించకపోవచ్చని పలువురు ఆందోళన చెందుతున్నారు.
మున్సిపాలిటీలను అప్పుల్లో దింపడమే లక్ష్యం


