ప్రభుత్వాల సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు ఇప్పటికే బడ్జెట్ నిధులతో నడిచే సమాచార పౌర సంబంధాల శాఖ (ఐఅండ్‌పీఆర్) అనే శాఖ ఒకటి ఉంది. ఈ వ్యవస్థను బలోపేతం చేయకుండా, పబ్లిసిటీ పేరుతో ప్రయివేటు ఇన్‌ఫ్లూయెన్సర్స్‌కు ప్రజాధనం చెల్లించడం వల్ల జవాబుదారీతనం దెబ్బతింటుంది. ఆర్థిక లోటున్న రాష్ట్రంలో ప్రాధాన్యత రహిత ప్రచారాల కంటే విద్య, వైద్యం, ఉపాధి కల్పన, రైతు సంక్షేమంపై దృష్టి పెట్టడం తక్షణ అవసరం. – వాడ గంగరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి.
చట్టపరమైన నిబంధనలు, పక్షపాత ముప్పు
ప్రభుత్వ నిధులతో నిర్వహించే ప్రచారాల్లో ఎలాంటి పక్షపాతం, రాజకీయరంగు ఉండకూడదని స్పష్టమైన ఆదేశాలున్నాయి. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌ను ఎంపిక చేసే ప్రక్రియలో పారదర్శకత లోపిస్తే, ఇది అధికార దుర్వినియోగానికి దారితీస్తుంది.
– విజయసింహారెడ్డి, రిటైర్డ్ తహసీల్దార్, అడ్వకేట్.
హామీలను విస్మరించారు
‘ప్రభుత్వం తమ సొంత సెల్ఫ్ డబ్బా’ కోసం లక్షలాది రూపాయలను సోషల్ మీడియా ప్రచారకర్తలకు ధారపోయడం సమంజసం కాదు. ఇచ్చిన హామీల ప్రకారం నిరుద్యోగ భృతిని పునరుద్ధరించడం, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం, సంక్షేమ పింఛన్ల విస్తరణపై దృష్టి పెట్టాలి. ప్రచారాల కోసం ప్రజాధనాన్ని వృధా చేయడం సరైన విధానం కాదు.
– మనోజ్‌రెడ్డి, యువత. చిత్తూరు.
ఆర్థిక శ్రేయస్సు, నిధుల దుర్వినియోగమే
రాష్ట్రం తీవ్రమైన అప్పులు, ఆర్థిక లోటు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రచారాలకు ప్రత్యేక బడ్జెట్ అవసరమా? ఏటా పబ్లిసిటీ కోసం కోట్లాది రూపాయాలు ధారపోయడం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై మరింత భారం పడుతుందే తప్ప ప్రజలకు ఎలాంటి ప్రత్యేక్ష ప్రయోజనం చేకూరదు.
– సోను, యువత, ఐరాల.
ఐటీడీపీకి దోచిపెట్టే యత్నం
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీను అమలు చేయకుండా ఇప్పుడు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌కు శ్రీకారం చుట్టడం అన్యాయం. ఈ ప్రక్రియతో ప్రైవేట్ వ్యక్తులకు నెలకు రూ.25 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు ప్రజాధనాన్ని పంచిపెట్టడం దారుణం. ఇది కేవలం ఎన్నికల ముందు టీడీపీ తరఫున ప్రచారం చేసిన ఐటీడీపీ కార్యకర్తలకు, సోషల్ మీడియా విభాగాలకు బహుమానంగా ప్రజాధనాన్ని దోచిపెట్టే పక్షపాత చర్య తప్ప మరొకటి కాదు. – శివారెడ్డి,
ఏఐఎస్‌ఎఫ్ జాతీయ కార్యదర్శి.


