ఆదమరిస్తే..
అతివేగం.. నిద్రమత్తే కారణమా..?
బెంగళూరు ఎక్స్‌ప్రెస్ హైవేలో
వాహనాల రద్దీ
పలమనేరు : చైన్నె– బెంగళూరు హైవేపై గత కొన్నేళ్లుగా పలమనేరు ప్రాంతంలో మొగిలి ఘాట్, పలమనేరు బైపాస్, గండ్రాజుపల్లి తదితర ప్రాంతాల్లో తరచూ మేజర్ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. గత ఐదేళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 30 మంది దాకా మృతి చెందగా వందమంది దాకా గాయపడ్డారు. ఈ నేపధ్యంలోనే ఈ ప్రాంతంలో మూడు నెలల క్రితం ఎన్‌హెచ్–7 చైన్నె– బెంగళూరు ఎక్స్‌ప్రెస్ హైవే కింద హొసకోట్ నుంచి బైరెడ్డిపల్లె వరకు దాదాపు 78 కిలోమీటర్ల మేర కొత్తరహదారి మొదలైంది. ఇందులో ఇప్పటికే వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఈ రోడ్డుతో ప్రమాదాలు తగ్గుముఖం పడతాయని అందరూ భావించారు. కానీ కొత్త ఎక్స్‌ప్రెస్ హైవేలోనూ ప్రమాదాలు సంభవించడం జనంలో ఆందోళన పెంచుతోంది.
ఎంత కట్టుదిట్టంగా ఉన్నప్పటికీ..
ఎక్స్‌ప్రెస్ హైవేలోకి పశువులు, కుక్కలు తదితరాలు రాకుండా రహదారికి ఇరువైపులా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఎగ్జిస్ట్ పాయింట్‌లలో తప్పా ఎక్కడా రహదారిలోకి ప్రవేశించేందుకు వీలుకాదు. దీంతోపాటు ఈ మార్గంలో బైక్‌లు, ఆటోలు, ట్రాక్టర్లకు అనుమతుల్లేవు. ఫలితంగా వాహనాలు గంటకు వంద నుంచి 150 కి.మీ వేగంతో నడుస్తున్నాయి. ఇన్ని సురక్షిత చర్యలున్నా ఈ మూడు నెలల్లో ఈ హైవేపై మేజర్ ప్రమాదాలు సంభవించాయి. వి.కోటకు 27 .మీ దూరంలోని దొడ్డకారి గ్రామంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు స్పాట్‌లోనే మృతి చెందారు. మొత్తం మీద ఇప్పటిదాకా నాలుగు ప్రమాదాల్లో 8మంది మృత్యువాత పడ్డారు.
విశాలమైన రహదారులు సైతం ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఎక్స్‌ప్రెస్ హైవేలు కూడా ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. ఆధునిక వాహనాల్లో మితిమీరిన వేగంతో డ్రైవింగ్ చేస్తుండడంతో తరచూ యాక్సిడెంట్లు సంభవిస్తున్నాయి. అందులో భాగంగానే చైన్నె– బెంగళూరు ఎక్స్‌ప్రెస్ హైవే మీద మృత్యుఘంటికలు మోగుతున్నాయి. హాయిగా రాకపోకలు సాగించవచ్చనుకుంటే.. వాహనదారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.


