చక్కెర ధర పెరగడంతో చెరుకు సాగు చేపడుతున్న రైతులు ప్రస్తుతం జిల్లాలో 6వేల హెక్టార్లలో పంట మరింతగా విస్తరించే అవకాశముందంటున్న అధికారులు
ఒకప్పుడు పచ్చని తోటలు.. చక్కెర మిల్లుల సైరన్లతో కళకళలాడిన జిల్లాలో మళ్లీ చెరుకు సాగు పెరిగే అవకాశం కనిపిస్తోంది. దశాబ్ద కాలంగా నష్టాల సుడిగుండంలో చిక్కుకుని ఫ్యాక్టరీలు మూతపడిన దశ నుంచి కోలుకునే పరిస్థితి దర్శనమిస్తోంది. పెరిగిన చక్కెర ధర రైతాంగంలో కొత్త ఆశలన రేకెత్తిస్తోంది. ఒకప్పుడు 30 వేల హెక్టార్లలో విస్తరించిన సాగు.. నేడు 6 వేల హెక్టార్లకు పడిపోయినా.. మళ్లీ పుంజుకుంటుందని అధికార యంత్రాంగం సైతం వెల్లడిస్తోంది.
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : ఉమ్మడి చిత్తూరు జిల్లా బెల్లం ఉత్పత్తికి, చెరుకు సాగుకు రాష్ట్రంలోనే చిరునామాగా ఉండేది. జిల్లా వ్యాప్తంగా 6 చక్కెర కర్మాగారాలు నిరంతరం నడుస్తూ వేలాది మంది రైతు కుటుంబాలు, కార్మికులకు ఉపాధినిచ్చాయి. అయితే, 2014 తర్వాత పరిస్థితులు తలకిందులయ్యాయి. ఉత్తరాది రాష్ట్రాలలో చక్కెర ఉత్పత్తి విపరీతంగా పెరగడంతో దేశీయ మార్కెట్‌లో నిల్వలు పెరిగిపోయాయి. దీని ప్రభావంతో చక్కెర ధరలు ఘోరంగా పడిపోయి, దక్షిణ భారత మిల్లులు తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోయా యి. రైతులకు చెల్లింపులు భారమై జిల్లాలోని మిల్లులు ఒకటొకటిగా మూతపడ్డాయి. ఓ వైపు పంట పెట్టుబడి పెరగడం, మరోవైపు కోత, రవాణా ఖర్చులు టన్నుకు ఏకంగా రూ.1,000 నుంచి రూ. 1,400 వరకు ఎగబాకాయి. స్థాని కంగా కూలీలు దొరక్కపోవడంతో ఒడిశా వంటి పక్క రాష్ట్రాల కార్మికులపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది. పర్యవసానంగా 30వేల హెక్టార్లుగా ఉన్న సాగు విస్తీర్ణం ప్రస్తుతం కేవలం 6వేల హెక్టార్లకు పడిపోయింది. ప్రస్తు తం ఎస్‌ఆర్‌పురం మండలం నెలవాయిలో మాత్రమే ఓ ఫ్యాక్టరీ నడుస్తోంది.
తియ్యని ఆశలు
గడిచిన రెండు నెలల వ్యవధిలోనే బహిరంగ మార్కెట్‌లో కిలో చక్కెర ధర రూ.40 నుంచి ఏకంగా రూ.60 వరకు పెరగడం రైతుల్లో తియ్యని ఆశలను చిగురింపజేసింది. ఈ పరిణామంతో చక్కెర కర్మాగారాల యాజమాన్యా లు మళ్లీ లాభాల బాట పట్టాయి. ఇన్నేళ్లుగా నష్టాలను ఓర్చి పంటను కాపాడుకున్న తమకు ఈ పెరిగిన ధరల ప్రయోజనాన్ని అందించాలని రైతాంగం డిమాండ్ చేస్తోంది. రాబోయే సీజన్‌న్‌కు కేంద్ర ప్రభుత్వం 9.50శాతం రికవరీ ప్రాతిపదికన టన్ను చెరుకుకు రూ.3,383 ఎఫ్‌ఆర్‌పీ ప్రకటించగా, ప్రస్తుతం ఓ మిల్లు యాజమాన్యం టన్నుకు రూ. 3,500 ఇస్తోంది. అయితే పెరిగిన సాగు వ్యయానికి, ప్రస్తుత మార్కెట్ ధరలకు అనుగుణంగా టన్నుకు రూ. 5వేల మద్దతు ధర చెల్లించాలని రైతులు కోరుతున్నారు. అంతేకాకుండా మిల్లు యాజమాన్యాల నుంచి కోత పర్మిట్లు రావడంతో జాప్యం జరుగుతుండటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో చాలామంది పంటను ఇతర జిల్లాల మిల్లులకు తరలించడమో, లేదా నాటు బెల్లం తయారీకి మళ్లించడమో చేస్తున్నారు.
ఎల్‌నినో ఎఫెక్ట్
ఒకవైపు చక్కెర ధరల రూపంలో ఆశలు కనిపిస్తున్నా, మరోవైపు ఎల్‌నినో ప్రభావంతో కరువు కమ్ముకోవడం రైతులకు గుబులును మిగులుస్తోంది. ఏ పంట వేయాలన్నా ఆచి తూచి అడుగులు వేయాల్సిన పరిస్థితుల్లో, వర్షాధారిత సాగుపై ఆధారపడకుండా బోరు బావుల కింద రైతులు మాత్రం చెరుకు వైపే మొగ్గు చూపుతున్నారు. వర్షాభావం వల్ల ఇతర పంటలు దెబ్బతిన్నా, చెరుకు గడ్డి జాతి పంట కావడంతో నీటి ఎద్దడిని కొంతకాలం తట్టుకుని నిలబడే సామర్థ్యం ఉండడమే ఇందుకు కారణం. బిందు సేద్యం ద్వారా తక్కువ నీటితోనే బోరు బావుల కింద సమర్థవంతంగా సాగు చేయవచ్చని రైతులు భావిస్తున్నారు. భూమిలో తేమ ఆవిరి కాకుండా చెరుకు చెత్తను కప్పడం, కరువును తట్టుకునే వంగడాలను ఎంపిక చేసుకోవడం లాంటి జాగ్రత్తలతో రైతన్నలు అడుగులు ముందుకు వేస్తున్నారు.


