చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలోని 40 సెక్షన్ల పరిధిలో మంగళవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమం చేపట్టనున్నట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ అమ ర్‌బాబు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలను నమోదు చేసుకుంటారని, వాటిని దశల వారీగా పరిష్కరిస్తామని వివరించారు.
కుప్పం ఏఎస్పీగా హేమంత్‌రెడ్డి
కుప్పం : కుప్పం పోలీస్ డివిజన్‌కు అడిషనల్ ఎస్పీ ని నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పోలవరం జిల్లా చింతూరు ఏఎస్పీ హేమంత్ రెడ్డిని కుప్పానికి బదిలీ చేస్తున్నట్లు పేర్కొంది. కుప్పం డీఎస్పీ పార్థ సారథిని డీఐజీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. అలాగే కుప్పం అర్బన్ సీఐ సయ్యద్ హాషంను చిత్తూరు వన్‌టౌన్‌కు బదలీ చేశారు.
11న ముసాయిదా
ఓటర్ల జాబితా
చిత్తూరు కార్పొరేషన్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా ఆదేశించారు. ఈ మేరకు జిల్లాల వారీగా ఓటర్ల ముసాయిదా జాబితాను సిద్ధం చేయాలని సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన తుది జాబితా ఓటర్ల వివరాలను ఎంపీటీసీ , జెడ్పీటీసీల సెగ్మెంట్ల వారీగా విభజించాలని సూచించారు. ఈ మేరకు ఈనెల 11న ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీటీసీ ఓటర్లు, జెడ్పీ కార్యాలయంలో జెడ్పీటీసీ ఓటర్ల వివరాలను ప్రచురించనున్నారు.
బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం
చిత్తూరు కలెక్టరేట్ : కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీని ఆహ్వానించారు. సోమవారం ఈ మేరకు ఆలయ కమిటీ సభ్యు లు, ఈఓ పెంచలకిషోర్ ఆహ్వానపత్రిక అందజేశారు. ఈఓ మాట్లాడుతూ ఈ నెల 14వ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటం బహూకరించారు. ఆలయ కమిటీ చైర్మన్ సురేంద్రబాబు తది తరులు పాల్గొన్నారు.
ఎయిడ్స్‌పై
అవగాహన మారథాన్
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఎయిడ్స్‌పై యువతలో అవగాహన పెంపొందించేందుకు ఈ నెల 10వ తేదీన చిత్తూరులో ప్రత్యేక అవగాహన మారథాన్ నిర్వహించనున్నట్లు జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ మరియు టీబీ అధికారి వెంకట ప్రసాద్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ 17 ఏళ్ల నుంచి 25 ఏళ్ల యువతీ యువకులు మారథాన్‌లో పాల్గొనవచ్చన్నారు. ఈ మారథాన్ ఉదయం 7.30 గంటలకు మెసానికల్ గ్రౌండ్ నుంచి ప్రారంభమై పీవీకేఎన్ కళాశాల మీదుగా తిరిగి మెసానికల్ గ్రౌండ్‌కు చేరుకుంటుందని వెల్లడించారు. ప్రతిభ కనబరచిన యువతీయువకులకు వేర్వేరుగా రూ.10వేల ప్రథమ బహుమతి, రూ.7వేల ద్వితీయ బహుమతి అందించనున్నట్లు వివరించారు. ఆసక్తి గల వారు ఆరోజు ఉదయం 5.30 నుంచి 7.00 గంటలలోపు గ్రౌండ్ వద్దకు చేరుకోవాలని కోరారు.
సత్వర న్యాయమే లక్ష్యం
చిత్తూరు రూరల్ (కాణిపాకం ): ప్రజలకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ఎస్పీ తుషార్ డూడీ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఎస్పీతోపాటు నాన్ కేడర్ ఎస్పీ రాజశేఖర్‌రాజు, ఏఎస్పీ ఎస్.షాను, చిత్తూరు ఎస్‌డీపీఓ వెంకటనారాయణ అర్జీలు స్వీరించారు. ఎస్పీ మాట్లాడుతూ వినతులను సమగ్రంగా విచారించి నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని స్పష్టం చేశారు. అధికారులు అలసత్వం ప్రదర్శించకుండా నిబద్ధతతో పనిచేసి బాధితులకు అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో బాధితుల నుంచి మొత్తం 45 ఫిర్యాదు లు అందినట్లు అధికారులు వెల్లడించారు.


