నిలకడగా టమాటా ధరలు!
పలమనేరు : పలమనేరు టమాటా మార్కెట్‌లో 14 కిలోల బాక్సు ధర రూ.300గా ఉంది. గత పది రోజులుగా ఇదే ధర పలుకుతోంది. స్థానికంగా టమాటా సీజన్ ముగియడంతో ధరలు ఆ మాత్రమైనా ఉన్నాయనే మాట రైతుల్లో వినిపిస్తోంది. సాధారణంగా ఈ ప్రాంతంలో మార్చి నుంచి సెప్టెంబరు వరకు సీజన్ నడుస్తుంది. ఇప్పటికే ఇక్కడి తోటలు ఒడిగిపోయాయి. ఉన్న తోటలు ఈనెలాఖరు కల్లా పూర్తవుతాయి. ఫలితంగా స్థానిక మార్కెట్‌కు రోజుకి 4 నుంచి 5 లారీల సరుకు మాత్రమే వస్తోంది. సీజన్‌లో అయితే రోజుకు 30 లారీల దాకా టమాటాలు వచ్చేవి. ఏదేమైనా లోకల్‌గా సరుకు ఎక్కువగా ఉన్నప్పుడు ధరల్లేక సీజన్ ముగుస్తున్న సమయంలో కాస్త ధరలు పెరిగినా ప్రయోజనం లేదని రైతులు చెబుతున్నారు. ఎల్‌నిలో ప్రభావంతో వాతావరణంలో మార్పులు ఏర్పడి స్థానికంగా ఎండలు దంచుతున్నాయి. ఇక తమిళనాడులో అయితే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైమాటే. దీంతో తమిళనాడులో టమాటాకు డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా తమిళనాడు నుంచి వ్యాపారులు ఇక్కడి మార్కెట్‌లకు వస్తున్నారు. మొత్తం మీద సీజన్‌లో రైతులతో కళకళలాడిన మార్కెట్ సీజన్ ముగుస్తుండడంతో పలుచగా కనిపిస్తోంది.


