చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల పాఠశాలలు, కళాశాలల సమయాలు, తిరిగి ఇళ్లకు వెళ్లే సమయాల్లో ఆర్టీసీ బస్సులు ఆపడం లేదని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఈ మేరకు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీకి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ పూతలపట్టు మండలం తిరుపతి రోడ్డులోని వేము ఇంజినీరింగ్ కాలేజీ వద్ద ఉదయం, సాయంత్రం వేళల్లో ఆర్టీసీ బస్సులు నిలపడం లేదన్నారు. దీంతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కాలేజీ యాజమాన్యం, ఆర్టీసీ అధికారులు పట్టించుకోకపోవడంతో దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారని వివరించారు. ఐరాల మండలంలో స్కూల్ వదిలే సమయానికి నడపాల్సిన ఆర్టీసీ బస్సును రాత్రి 6 గంటల తర్వాత నడుపుతున్నారన్నారు. దీంతో విద్యార్థులు 4 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే జీడీ నెల్లూరు మండలం వేల్కూరు నుంచి యలమరాజపురానికి వెళ్లే దారిలోని బట్టు కండ్రిగ వద్ద సాయంత్రం 5.30 నుంచి 7 గంటల మధ్య విద్యార్థినులు, మహిళలపై ఈవ్‌టీజింగ్ పెరుగుతోందని, ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్‌ఎఫ్‌ఐ కార్యదర్శి మసూద్, మాజీ జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు పాల్గొన్నారు.


