పాడెక్కించావా తల్లీ..! | - | Sakshi
Sakshi News home page

పాడెక్కించావా తల్లీ..!

Aug 15 2026 1:04 AM | Updated on Aug 15 2026 1:04 AM

● బ్యానర్‌ కడుతూ విద్యుత్‌ షాక్‌తో బలి ● ద్రౌపదీ దేవి బ్రహ్మోత్సవాల వేళ.. పుత్తూరులో విషాదఛాయలు

పటం కట్టడానికొస్తే..

ఇద్దరు మిత్రులను మింగేసిన కరెంటు తీగలు

పుత్తూరు: పుత్తూరులో శ్రీద్రౌపదీదేవి సమేత ధర్మాజుల స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎటు చూసినా రంగు రంగు బ్యానర్లతో మిత్రులంతా భక్తులకు శుభాకాంక్షలు తెలుపుతూ బ్యానర్లు కడుతున్నారు. డిగ్రీ మొదటి సంవత్సరం చదివే ఇ.గోకుల్‌(19), ఎ.విఘ్నేష్‌(19) అనే ఇద్దరు ప్రాణమిత్రులకు మనమూ బ్యానర్‌ కట్టాలనే ఉత్సాహం కలిగింది. బ్యానర్‌ సిద్ధం చేసుకున్న వీరు శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో స్థానిక కార్వేటినగరం రోడ్డులోని రెండంతస్తుల మిద్దైపెకి ఎక్కారు. బ్యానర్‌ కట్టే క్రమంలో పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్‌ తీగలు బ్యానర్‌ ఫ్రేమ్‌కు తగిలాయి. విష్ణేష్‌కు ముందుగా కరెంట్‌ షాక్‌ కొట్టడంతో అతని కుడి కాలి వేళ్లు కాలిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. అతన్ని రక్షించబోయిన గోకుల్‌కు షాక్‌ తగిలి ఎగిరి దూరంగా పడి ప్రాణాలు విడిచాడు. విషయం తెలుసుకున్న డీఎస్పీ రవికుమార్‌, సీఐ నెట్టికంఠయ్య సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఒకరి తండ్రి మిలటరీలో హెడ్‌ కానిస్టేబుల్‌

మరొకరి తండ్రి ఆటో డ్రైవర్‌

పుత్తూరు ఎస్‌బీఐ కాలనీలో ఉంటున్న గోకుల్‌ తండ్రి చిరంజీవి రాజస్తాన్‌ మిలటరీలో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. తల్లి నీలమ్మ, అక్క దివ్యశ్రీతో కలిసి ఉంటున్నాడు. పుత్తూరు పట్టణం కళ్యాణపురంలో నివాసం ఉంటున్న విఘ్నేష్‌ తండ్రి గిరి ఆటో నడుపుతూ కొడుకును డిగ్రీ చదివిస్తున్నాడు. అమ్మ సాయిలక్ష్మి, తమ్ముడు ప్రణయ్‌(7)తో కలసి ఉంటున్నాడు. తమ బిడ్డల భవిష్యత్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ రెండు కుటుంబాల్లో పండుగ వేళ తీరని విషాదాన్ని నింపింది.

అధికారుల నిర్లక్ష్యం

పట్టణంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా విచ్చలవిడిగా బ్యానర్లు కడుతున్నా మున్సిపల్‌ అధికారు పట్టించుకోకపోవడం వల్లే ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయంటూ పలువురు విమర్శిస్తున్నారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. బ్యానర్ల ఏర్పాటుకు అనుమతి, స్థల పరిమితులు, విద్యుత్‌ తీగల సమీపంలో ఏర్పాటు చేయకూడదన్న నిబంధనల అమలులో మున్సిపల్‌ అధికారులు ఎలాంటి చొరవ చూపలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement