బిల్లు కలెక్టర్ల
ఎన్టీఆర్ హయాంలో ఉద్యోగాలు
38 ఏళ్లుగా విద్యుత్‌శాఖలో పీసీఏలుగా విధులు నిర్వహిస్తున్న బిల్ కలెక్టర్లకు సెప్టెంబర్ నుంచి పని లేదని ఆ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు గడువు ఇచ్చి అప్పుడు రెన్యూవల్ చేస్తామని నమ్మించారు. తాజాగా ఆగస్టులో పనిలోకి రావద్దంటూ అధికారులు హుకుం జారీచేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేరే విభాగంలో అయిన తమకు ఉపాధి కల్పించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో ఈనెల 17, 18 తేదీల్లో 48 గంటల పాటు తిరుపతి సీఎండీ కార్యాలయం వద్ద రిలే నిరహార దీక్షలు చేసేందుకు సిద్ధమయ్యారు.
చిత్తూరు కార్పొరేషన్: గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగి కరెంటు బిల్లు వసూళ్లు చేసి విద్యుత్ శాఖకు ఆ మొత్తాన్ని చెల్లిస్తున్న విద్యుత్ బిల్లు కలెక్టర్లు లేదా పీసీఏ(ప్రైవేటు కలెక్షన్ ఏజెంటు)ల కడుపుకొట్టొదని వారు వేడుకుంటున్నారు. సంస్థకు వినియోగదారులకు మధ్య వారధిగా పనిచేస్తున్న వారిని ఇంటికి సాగనంపడం సరికాదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు సంవత్సరాలుగా ఇదే వృత్తిని నమ్ముకుని కుటుంబాలను పోషిస్తున్నామని తమను రోడ్డుపై పడవేయవద్దని విన్నవిస్తున్నారు. గత 38 సంవత్సరాలుగా పీసీఎలుగా వీరు విద్యుత్‌శాఖలో పనిచేస్తున్నారు. ప్రతి ఏడాది సెప్టెంబర్‌లో కాంట్రాక్ట్‌ను రెన్యూవల్ చేయడం ఆనవాయితీగా వస్తోంది. కానీ డిజిటల్ పేమెంట్స్ పెంచే యోచ నతో వీరి కాంట్రాక్ట్ ఇక రెన్యూవల్ చేయడం లేదని నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. దీంతో డిస్కం పరిధిలో దాదాపు 100 మంది కుటుంబాలు రోడ్డున పడునున్నాయని వారు బాధపడుతున్నారు.
ఎన్టీఆర్ హయాంలో ఉద్యోగాలు
నందమూరి తారకరామారావు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 1988 సంవత్సరంలో పీసీఏ విధానం ప్రవేశపెట్టారు. స్థానికంగా ఉన్న యువతకు కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగాలు ఇచ్చారు. విద్యుత్ శాఖలో మొదటిగా కాంట్రాక్ట్ పద్ధతికి శ్రీకారం చుట్టారు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పటి నుంచి వీరు సేవలు అందిస్తున్నారు. వీరి తర్వాత సంస్థలో కాంట్రాక్ట్ పద్ధతిలో చేరిన వారు దశలవారీగా రెగ్యులర్ అయ్యారు. ప్రతి ఏడాది ఏప్రిల్ 1–మార్చి 30 వరకు కాంట్రాక్ట్ సమయం. కానీ ఈ ఏడాది సెప్టెంబర్ వరకు గడువు ఇచ్చి అప్పుడు రెన్యూవల్ చేస్తామని నమ్మించారు. ఇప్పుడు ఆగస్టులో పనిలోకి రావదంటూ అధికారులు హుకుం జారీ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో లాగిన్‌లు ఇవ్వడం లేదు. సీఎండీ సమయం ఇచ్చిన స్థానిక అధికారులు ఏకపక్షంగా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో తమకు ప్రత్యామ్నాయంగా విద్యుత్ శాఖలో ఉపాధి చూపాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. విజయవాడలో సోమవారం నిరసన వ్యక్తం చేసి అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. అలాగే ఈనెల 17, 18న 48 గంటల పాటు నిరహారదీక్ష ను తిరుపతిలోని సీఎండీ కార్యాలయం వద్ద ఉద్యోగులు కుటుంసభ్యులతో కలిసి నిరసన వ్యక్తం చేయనున్నట్లు నాయకులు పేర్కొన్నారు. వీరికి సీఐటీయూ నాయకులు మద్దతు ప్రకటించారు.
100 కుటుంబాలు రోడ్డున
ఇప్పుడు ఏకంగా డిజిటల్ పేమెంట్స్ పేరిట పీసీఎలను తొలగింపునకు చర్యలు చేపట్టారు. ఉద్యోగులు విధుల్లో చేరేటప్పుడు వారి వద్ద నుంచి రూ.లక్ష బ్యాంక్ గ్యారెంటీ, రూ.10వేలు సెక్యూరిటి డిపాజిట్ తీసుకున్నారు. వీరికి ఒక బిల్లుకు రూ.4.19 పైసలు చొప్పున సంస్థ చెల్లిస్తుండగా అందులో కాంట్రాక్టర్, బిల్లు పేపర్, ఆన్‌లైన్ చార్జీలు, ఈపీఎఫ్, ఈఎస్‌ఐలకు రూ.1.32 పోగా వారికి వచ్చేది రూ.2.87 మాత్రమే. ఇందుకు వారు స్మార్ట్ ఫోన్, బిల్లు ప్రింటర్, బైక్‌కు పెట్రోల్, భోజనం ఖర్చులు పెట్టుకొని పల్లెల్లో పనిచేస్తున్నారు. మండలంలోని సర్వీసులను బట్టి నెలకు సుమారు రూ.20–40 వేల మధ్య వారికి వేతనంగా వస్తోంది. ప్రతి ఉద్యోగి ద్వారా నెలకు సంస్థకు దాదాపు రూ.40 లక్షలు బిల్లుల రూపేణా వసూలవుతోంది. ప్రతినెల 1,500 కిలోమీటర్లు తక్కువ లేకుండా ప్రయాణం చేసి పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చిల్లర్లు లేకపోవడంతో చిల్లర దుకాణల వద్ద అదనపు మొత్తం చెల్లించి విద్యుత్ వినియోగదారుల కోసం తీసుకొని చిల్లర తీసుకుని వెళ్తున్నారు.
ప్రత్యామ్నాయం చూపాలి
డిస్కం పరిధిలోని పనిచేస్తున్న పీసీఎ(బిల్ కలెక్టర్లకు)కు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గం చూపాలి. సంస్థను నమ్ముకుని 100 మంది దాదాపు 38 సంవత్సరాలుగా జీవిస్తున్నాం. ఇప్పుడు అకస్మాత్తుగా పనికి రావద్దంటే ఎలా బతకాలి. సంస్థ పరిధిలోనే ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి. – పీ.వీ. రమణ, రాష్ట్ర అధ్యక్షుడు బిల్లు కలెక్టర్స్ కమిటీ
కార్మికులకు న్యాయం చేయాలి
విద్యుత్‌శాఖలో పనిచేస్తున్న ప్రైవేటు బిల్లు కలెక్టర్లకు న్యాయం చేయాలి. కాలానుగుణంగా మార్పులు సహజం. డిజిటల్ పేమెంట్స్ పెంచడానికి కార్మికులను తీసివేయడం సరికాదు. వారికి అన్యాయం జరగకుండా సీఎండీ దృష్టి పెట్టాలి.
– గంగరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు సీఐటీయూ


