దగా డీఎస్సీపై దండయాత్ర | - | Sakshi
Sakshi News home page

దగా డీఎస్సీపై దండయాత్ర

Aug 12 2026 12:10 AM | Updated on Aug 12 2026 12:10 AM

చంద్రబాబుకు దమ్ముంటే

సీబీఐ విచారణకు అంగీకరించాలి

అక్రమాలకు బాధ్యత వహించి లోకేష్‌ రాజీనామా చేయాలి

డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం

మాజీ మంత్రి ఆర్కే రోజా

పుత్తూరులో వైఎస్సార్‌ సీపీ భారీ ర్యాలీ

పుత్తూరు: కఠోర శ్రమతో డీఎస్సీ పరీక్షకు హాజరైన విద్యార్థులను దగా చేస్తూ లీకేజీలకు పాల్పడిన చంద్రబాబు ప్రభుత్వం దమ్ముంటే సీబీఐ విచారణకు సిద్ధం కావాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ నగరి నియోజకవర్గ సమన్వయకర్త ఆర్కే రోజా డిమాండ్‌ చేశారు. డీఎస్సీలో జరిగిన అవకతవకలను నిరసిస్తూ మంగళవారం పుత్తూరులో రోజా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ఆంజనేయస్వామి ఆలయం నుంచి అంబేడ్కర్‌ సర్కిల్‌ వరకు సాగింది. ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌.రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ నేతలు నిందలు మోపారని తెలిపారు. అప్పుడు వైఎస్సార్‌ తన బిడ్డ తప్పు చేసి ఉంటే ఉరిశిక్ష వేయండి అని సీబీఐ విచారణకు వెళ్లి తమ నిజాయితీని నిరూపించుకున్నారని గుర్తు చేశారు. అలాగే చంద్రబాబుకు తన కొడుకుపై నమ్మకం ఉంటే సీబీఐ విచారణకు అంగీకరించాలని డిమాండ్‌ చేశారు. తొడగొట్టే లోకేష్‌ నిజంగా దమ్ముంటే డీఎస్సీ లీకేజీపై చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా చేపట్టిన డీఎస్సీ నిర్వహణలో పేపర్‌ లీకేజీలు, ఫేక్‌ సర్టిఫికెట్ల విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ప్రశ్నాపత్రం లీక్‌ కాకుంటే ఫస్ట్‌ ర్యాంకు వచ్చిన నవీన్‌కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. స్పోర్ట్స్‌ కోటా కింద ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్‌ నైతిక బాధ్యత వహించి మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదన్నారు. రూ.10 వేల కోట్లకు పైగా ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగులకు ఇస్తామన్న నెలకు రూ.3 వేలను బకాయిలతో సహా చెల్లించాలన్నారు. కార్యక్రమంలో రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త పురుషోత్తంరెడ్డి, నగరి నియోజకవర్గ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పరిశీలకుడు రాహుల్‌ రాజారెడ్డి, అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement