కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ వెంటనే క్రమబద్ధీకరించాలి.
ప్రాసెస్ పూర్తయ్యే వరకు పూర్తి వేతనం ఇవ్వాలి.
విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయంతో పాటు ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.
ఈపీఎఫ్ సౌకర్యం, అనారోగ్యానికి గురైతే వేతనంతో కూడిన సెలవులు, కుటుంబాలకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలి.
సుదీర్ఘకాలం దూరంగా పనిచేస్తున్న వారికి బదిలీ అవకాశం కల్పించాలి.
చిత్తూరు రూరల్ (కాణిపాకం): కూటమి ప్రభుత్వ ఉదాసీన వైఖరిపై వైద్య ఆరోగ్య శాఖలోని కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జిల్లాలో ఐక్యవేదికగా ఏర్పడి సమర శంఖం పూరించారు. కరోనా వంటి క్లిష్ట సమయంలో ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి సేవలు అందించిన తమ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై మండిపడ్డారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో 260 మంది స్టాఫ్ నర్సులు, 76 మంది ఫార్మసిస్టులు, 61 మంది ల్యాబ్ టెక్నిషియన్లు పనిచేస్తున్నారు. వీరు రెండేళ్లుగా విధుల్లో పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. సకాలంలో వేతనం రాక అవస్థలు పడు తున్నారు. ఉద్యోగ భద్రత లేకపోవడంతో పాటు వైద్యసేవలు లేక విలవిలలాడుతున్నారు. నిబంధన ప్రకారం రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏకమయ్యారు.
ప్రభుత్వం నుంచి కరువైన స్పందన
వైద్య ఆరోగ్య శాఖలోని కాంట్రాక్ట్ ఉద్యోగులు జూన్ 17న విజయవాడలో భారీ ధర్నా నిర్వహించారు. జూలై 6న ముఖ్యమంత్రి పేషీ అధికారులు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, శాఖాధిపతులకు 45 రోజుల గడువుతో కూడిన సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ గడువు ఆగస్టు 20 నాటి తో ముగియనుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో విధులను బహిష్కరించి దశలవారీగా పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. సమ్మె నోటీసులో భాగంగా జిల్లా కలెక్టర్, ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, ఏరియా ఆస్పత్రుల అధికారులు, మెడికల్ సూప రింటెండెంట్లకు నోటీసులు అందజేశారు. అంతేకాకుండా తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను ప్రజాప్రతినిధులకు సమర్పించారు. ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకపోతే ఆగస్టు 20 నుంచి విధులను బహిష్కరిస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు.
ప్రధాన డిమాండ్లు


