చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లా వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో ఖాళీగా ఉన్న పారామెడికల్, ఇతర సపోర్టింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదల చేశామని డీసీహెచ్‌ఎస్ పద్మాంజలీదేవి తెలిపారు. ఈ మెరిట్ జాబితా అధికారిక వెబ్‌సైట్‌లో మంగళవారం నుంచి అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఎలక్ట్రీషియన్ (1), థియేటర్ అసిస్టెంట్ (4), ల్యాబ్ అసిస్టెంట్ (1), ప్లంబర్ (1), జనరల్ డ్యూటీ అటెండెంట్స్ (6), పోస్ట్‌మార్టమ్ అసిస్టెంట్ (3), ఆఫీస్ సబ్‌ఆర్డినేట్ (2) కలిపి మొత్తం 18 పోస్టులకు జాబితాను విడుదల చేసినట్లు తెలిపారు. ఈ ప్రొవిజనల్ మెరిట్ జాబితాపై అభ్యర్థులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే వెంటనే తమ వినతులను సమర్పించాలని, పరిశీలన అనంతరం త్వరలోనే తుది జాబితాను ప్రకటిస్తామని వెల్లడించారు.
గ్రంథాలయాల సెస్ బకాయిలు వసూలు చేయండి
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న గ్రంథాలయాల సెస్ బకాయిలను వసూలు చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో గ్రంథాలయ సంస్థకు రావాల్సిన సెస్ బకాయిల వసూల అంశంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ గ్రంథాలయాలు విద్యార్థులు, నిరుద్యోగులకు, సామాన్య ప్రజలకు ఉపయోగపడే అద్భుతమైన వ్యవస్థ అని అన్నారు. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. స్థానిక సంస్థల నుంచి రావాల్సిన సెస్ బకాయిల వసూలుకు మూడు నెలల కార్యాచరణను సిద్ధం చేయాలన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో 71 ప్రధాన గ్రంథాలయాలు, 102 బుక్ డిపాజిట్ సెంటర్లు ఉన్నట్లు తెలిపారు. వాటిలో 2008వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మున్సిపాలిటీలు, స్థానిక సంస్థల నుంచి రూ.33 కోట్ల సెస్ బకాయిలు రావాల్సి ఉందని వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఉన్న గ్రంథాలయాలను డిజిటలైజేషన్ చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ సమీక్షలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి లావణ్య, జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్, పలువురు అధికారులు పాల్గొన్నారు.
పకడ్బందీగా సర్ ప్రక్రియ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో సర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్‌ఓ మోహన్ కుమార్ ఆదేశించారు. ఆయన మంగళవారం అధికారులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో నో మ్యా పింగ్ కేటగిరిలో ఉన్న 23,881 మంది, మ్యాపింగ్‌లో లాజికల్ వ్యత్యాసాలు (అనామలీస్) కేట గిరిలో ఉన్న 1,10,429 మంది ఓటర్లకు నోటీసు లు జారీ చేయాల్సి ఉందని తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలకు ఆగస్టు 30 వరకు సమయం ఉందన్నారు. తుది ఓటర్ల జాబితా అక్టోబర్ 3న విడుదల చేస్తారన్నారు.


