బంగారుపాళెం: మండలంలోని గుంతూరు పంచాయతీ కురప్పల్లెకు చెందిన దేవేంద్ర, హేమలత దంపతుల కుమారుడు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జయదీప్(24) మృతిపై మిస్టరీ వీడడం లేదు. తమ బిడ్డను తీసుకువెళ్లి చంపేశారని, వారిపై గంగవరం పోలీసులు చర్యలు తీసుకోవడంలేదని తల్లిదండ్రులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారు మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ తమ గోడు వెల్లబోసుకున్నారు. తమ కుమారుడు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడని తెలిపారు. స్వగ్రామానికి చెందిన యువతిని రేండేళ్ల క్రితం నుంచి ప్రేమిస్తున్నాడని, ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు యువతిని దండపల్లె, కురప్పల్లె లోని బంధువు లింగ య్య ఇంటిలో ఉంచారని పేర్కొన్నారు. జూన్ 3వ తేదీ రాత్రి ప్రేమించిన అమ్మాయి రమ్మని చెప్పిందని పేర్కొంటూ జయదీప్‌ను తన స్నేహితులైన వినీత్, కళ్యాణ్ తీసుకెళ్లారని తెలిపారు. మరుసటి రోజు తెల్లవారు జామున జయదీప్‌కు ప్రమాదం జరిగిందని, పలమనేరు తీసుకెళుతున్నామని ముని రాజు అనే వ్యక్తి సమాచారం ఇచ్చాడని తెలిపారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం సీఎంసీకి తీసుకువస్తున్నట్టు చెప్పడంతో తాము మొగిలివెంకటగిరి వద్ద వారిని కలిసి రాణిపేట సీఎంసీకి వెళ్లామన్నారు. వారంరోజుల పాటు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ జూన్ 12న మృతి చెందాడన్నారు.
తీవ్రంగా తీవ్రంగా కొట్టడం వల్లే మృతి
డి కురప్పల్లెలో లింగయ్య కుటుంబ సభ్యులు తనను తీవ్రంగా కొట్టారని జయదీప్ తనకు చెప్పాడని అతని మామ విజయకుమార్ తెలిపారు. జయదీప్ మృతిపై గంగవరం పోలీసులకు ఫిర్యాదు చేశామని, సీఐ న్యాయం చేస్తామని తెలిపారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై రెండుసార్లు పీజీఆర్‌ఎస్‌లో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా స్పందించడంలేదని వాపోయారు. రాజకీయ జోక్యంతో కేసును నీరుగార్చుతున్నారని ఆరోపించారు. డి కురప్పల్లెకు చెందిన వసంత్, సోమశేఖర్ పలమనేరు ఎమ్మెల్యే అమరనాఽథరెడ్డి పేరు చెప్పుకుని కేసును తప్పుదోవపట్టిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల బంగారుపాళెంలోని కురప్పల్లెకు వచ్చిన లింగయ్య.. కేసును రాజీ చేసుకోకపోతే జయదీప్‌కు పట్టిన గతే మీకు పడుతుందని బెదిరించాడని బాధితులు తెలిపారు. జయదీప్ మృతిపై న్యాయం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్ దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు పేర్కొన్నారు.


