పలమనేరు: పెద్దపంజాణి మండలం మారప్పల్లిలో భూ వివాదంతోనే వ్యక్తిని హత్య చేసినట్టు పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ తెలిపారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు పేర్కొన్నారు. ఆయన మంగళవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 6న మారప్పల్లికి చెందిన శ్రీనివాసులు గ్రామ సమీపంలోని బండపై నాటు తుపాకి కాల్పులతో మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన పెద్దపంజాణి పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా రాయలపేట సమీపంలో చెన్నారెడ్డిపల్లి క్రాస్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అసలు విషయం తెలిసింది. భూ వివాదం కారణంగానే శ్రీనివాసులును వరుసకు తమ్ముడైన రామలింగం పథకం ప్రకారం హత్య చేసినట్టు గుర్తించారు. ఇందులో రామలింగంతో పాటు అతని స్నేహితులు, బంధువులైన తోటి నాగరాజు, రాజశేఖర్ అలియాస్ శేఖర్, భాను ప్రకాష్, మునిరాజ్‌ను నిందితులుగా చేర్చారు. హత్య జరిగిన రోజు శ్రీనివాసులుతో పాటు నిందుతుల్లో ఒకడైన భాను ప్రకాష్‌తో కలిసి బండపై మద్యం సేవిస్తూ ఇచ్చిన సమాచారంతో రామలింగం అక్కడికి చేరుకుని నాటుతుపాకీతో శ్రీనివాసులుపై కాల్చినట్టు తేలింది. సంఘటనా స్థలంలోని నాటు తుపాకీ, కుంటలోని మద్యం బాటిల్, జర్కిన్, మృతుని సెల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించిన గంగవరం సీఐ పరశురాముడు, పెద్దపంజాణి ఎస్‌ఐ సురేష్‌బాబును డీఎస్పీ అభినందించారు.


