కుప్పం రూరల్ : కుప్పం ప్రాంతంలో ఉన్న పరిశ్రమలకు హంద్రీ–నీవా నీరు ఇచ్చి, మరిన్ని పరిశ్రమలు వచ్చేలా చేస్తామని కడా పీడీ వికాస్ మర్మత్ తెలిపారు. ఆయన మంగళవారం పారిశ్రామికవాడలో నిర్మిస్తున్న మదర్ డెయిరీ పనులను పరిశీలించారు. మదర్ డెయిర్ ప్రతినిధులు నీటి సదుపాయం కల్పించాలని పీడీని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. హంద్రీ–నీవా ద్వారా పరిశ్రమలకు నీటి సదుపాయం కల్పించేందుకు ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నట్లు చెప్పారు. పనుల్లో వేగం పెంచి పరిశ్రమ ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని ప్రతినిధులను ఆదేశించారు. అనంతరం ఆయన రాళ్లబూదుగూరు ప్రభుత్వ బాలికల వసతి గృహం, విజలాపురం ఆశ్రమ గిరిజన సంక్షేమ పాఠశాల, కడపల్లి అంబేడ్కర్ గురుకుల పాఠశాల, రాళ్లబూదుగూరు పీహెచ్‌సీలను తనిఖీ చేశారు. విద్యార్థులకు వసతుల కల్పనలో అలసత్వం వద్దని, ఏదైనా అవసరమైతే తన దృష్టికి తీసుకురావాలని సిబ్బందిని ఆదేశించారు. గోడలపై పిచ్చి రాతలను చూసిన ఆయన పెయింటింగ్ వేయించాలని సూచించారు. కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పాజిటివ్ పీపుల్ పర్సెప్షన్ (పీపీపీ) స్థాయిలో హాస్టళ్లు ఉండాలన్నారు.


