కాణిపాకం: జిల్లాలో వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 21,903 హెక్టార్లు. ఈసారి ఖరీఫ్ సీజన్ ముగుస్తున్నా సాగైంది 93 హెక్టార్లు మాత్రమే. ఖరీఫ్ లక్ష్యా లను చేరుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం దారుణంగా విఫలమైంది. సీజన్ ప్రారంభంలోనే రైతుల అవసరాలకు సరిపడా రాయితీ విత్తనాలను అందించలేదు. కేటా యించిన అరకొర విత్తనాలు పలమనేరు, కుప్పం ప్రాంతాలకే పరిమితం చేశారు. మిగి లిన ప్రాంతాల రైతులు విధిలేక తమిళనాడులోని పళ్లిపట్టు, పరదరామి, పేర్నాంబట్టు తదితర ప్రాంతాల నుంచి తెచ్చుకోవాల్సి వచ్చింది. దీంతో ఎకరాకు రూ.30 వేలు వరకు పెట్టుబడి పెట్టి విత్తనం వేసిన రైతుకు ప్రకృతి కూడా సహకరించలేదు. వర్షాలు కురవకపోవడంతో పంటలన్నీ ఎండిపోతున్నాయి. చిత్తూరు, గుడిపాల, ఎస్‌ఆర్‌పురం, యాదమరి, జీడీనెల్లూరు, పాలసముద్రం, బంగారుపాళ్యం, పూతలపట్టు, ఐరాల, వి.కోట, పలమనేరు, తవణంపల్లి తదితర మండలాల్లో అధికంగా వేరుశనగ పంట ఎండిపోతోంది. అక్కడక్కడా రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని పెడుతూ పంటను కాపాడుకునేందుకు తాపత్రయం పడుతున్నా ఫలితం శూన్యంగా మారుతోంది. ఇంతటి ఘోర కలి కనిపిస్తున్నా అధికార యంత్రాంగంలో చలనం లేకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. 2024లో నష్టపోయిన వేరుశనగ పంటకే ఇప్పటి వరకు పైసా పరిహారం ఇవ్వలేదని, ఈసారి కూడా పంట ఎండిపోతే తమ బతుకులు రోడ్డున పడటం ఖాయమని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
జిల్లాపై వరుణుడు చిన్నచూపు చూస్తున్నాడు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా చుక్క చినుకును కూడా వర్షించడం లేదు. మబ్బులు వస్తాయన్న ఆశతో అప్పులు చేసి సాగు చేసిన వేరుశనగ పంట కళ్లముందే ఎండిపోతుంటే రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్లతో నీరు చల్లుతున్నారు. ప్రకృతి పగబట్టి పంటను ఎండబెడుతుంటే.. ప్రభుత్వం, అధికారులు తమను కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎండిపోతున్న
వేరుశనగ పంట


