ఉపాధ్యాయుల కష్టం గాల్లోకి
చిత్తూరు కలెక్టరేట్ : ఒక ఉద్యోగోన్నతి వదులుకుంటే ఆర్థికంగా నష్టపోతారు, హోదాను కోల్పోతారు. దానికి ఉపాధ్యాయులు సిద్ధపడ్డారు. ఏకంగా సర్వీసునే తుడిచేస్తారని వారు ఊహించలేదు. రివర్షన్ తీసుకున్న తేదీ నుంచే కొత్త సర్వీసుగా లెక్కగట్టడంతో సీనియారిటీ జాబితాలో మొదటి వందల్లో ఉండాల్సిన వారి పేర్లు 5,200 కంటే వెనక్కి వెళ్లిపోయాయి. ఈ ఘోరంపై బాధితులు గురువారం డీఈవో కార్యాలయం వద్ద ధర్నా చేశారు. వారికి యూటీఎఫ్, ఎస్టీయూ నాయకులు మద్దతు పలికారు. అనంతరం ఇన్‌చార్జి డీఈవో వెంకటేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర కార్యదర్శులు ఎస్‌ఎస్.నాయుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మధు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రెడ్డెప్పనాయుడు, మణిగండన్, గౌరవ అధ్యక్షులు సదాశివరెడ్డి, తదితర టీచర్లు పాల్గొన్నారు.
సీనియారిటీ కూడా లాగేసుకుంటారా?
ఉద్యోగ జీవితంలో ఉద్యోగోన్నతి వస్తే ఏ ఉద్యోగి అయినా సంతోషిస్తారు. అటువంటి ఉన్నత హోదాను, ఆర్థిక ప్రయోజనాలను వదులుకుని ఒక ఉపాధ్యాయుడు పాత కేడర్‌లోకి వచ్చాడంటే దాని వెనుక ఎంతటి బలమైన, బాధాకరమైన కారణాలు ఉంటాయో చంద్రబాబు సర్కారు ఆలోచించడం లేదు. కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చాలా మంది ఎస్జీటీలు స్కూల్ అసిస్టెంట్లుగా, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంలుగా ఉద్యోగోన్నతి పొందినప్పటికీ సుదూర ప్రాంతాలకు బదిలీ కావడం, భార్యాపిల్లల సంరక్షణ, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల అనారోగ్య సమస్యల వల్ల రివర్షన్ తీసుకున్నారు. వారు ఇప్పటికే ఉద్యోగోన్నతి హోదా ను, ఆర్థిక లబ్ధిని వదులుకుని నష్టపోయారు. విద్యా శాఖ అధికారులు విడుదల చేసిన తాజా జాబితాల్లో రివర్షన్ పొందిన తేదీ నుంచే వారి కొత్త సర్వీసు ప్రారంభమైనట్లు పరిగణించడం అత్యంత దారుణం. దీనివల్ల 500 లోపు ఉండాల్సిన వారి సీనియారిటీ నంబర్లు ఏకంగా 5,000 కంటే వెనక్కి వెళ్లిపోయాయి.
ప్రభుత్వ ఉద్యోగికి తన సర్వీసులో సీనియారిటీ అత్యంత కీలకం. జిల్లా విద్యాశాఖ ఇటీవల సబ్జెక్టులు, కేడర్ వారిగా విడుదల చేసిన ఉపాధ్యాయ సీనియారిటీ జాబితాలు దశాబ్దాల కాలంగా విధుల్లో ఉన్న ఉపాధ్యాయుల గుండెల్లో గునపాలు దింపుతున్నాయి. కుటుంబ, ఆరోగ్య సమస్యల వల్ల ఉద్యోగోన్నతిని వద్దనుకుని, పాత పోస్టులకే పరిమితమైన పాపానికి పాతికేళ్లకు పైగా సర్వీసును రద్దు చేసి, కొత్తగా ఉద్యో గంలో చేరిన జూనియర్ల కంటే కిందకు నెట్టేయడంపై బాధిత సీనియర్ ఎస్జీటీ ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగ విరమణ వేళ ఇంత అన్యాయమా?
‘మా అమ్మ ఆరోగ్యం క్షీణించడంతో ఉద్యోగోన్నతి వదులుకుని రివర్షన్ తీసుకున్నా ను. గత సీనియారిటీ జాబితాలో 210వ స్థానంలో ఉ న్న నా నంబరును ఇప్పుడు 5,290కి నెట్టేశారు. నేను ఉద్యోగ విరమణకు దగ్గరగా ఉన్న సమయంలో విద్యాశాఖ అన్యాయానికి ఒడిగట్టడం తగదు. ఆరోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న మాపై మానవతా దృక్పథం చూపాలి.
– హేమనాథం, బాధిత ఎస్జీటీ ఉపాధ్యాయుడు
26 ఏళ్ల సర్వీసును సున్నా చేశారు
‘నేను 1998 డీఎస్సీలో ఎస్జీ టీగా చేరాను. 2023 లో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్‌గా ప్రమోషన్ వచ్చి వి.కోటకు బదిలీ అయ్యింది. కు టుంబ సమస్యల వల్ల రివర్షన్ ఇచ్చా ను. పాత సీనియారిటీ ప్రకారం నా నంబర్ 500లో ఉండేది. ఇప్పుడు 5,287కు మార్చేశారు. 26 ఏళ్ల సర్వీసును తుడిచేసేశారు. ఇకపై ఉద్యోగోన్నతి అవకాశం లేకుండా చేయడం ఏం న్యాయం?
– కృష్ణారెడ్డి, బాధిత ఎస్జీటీ ఉపాధ్యాయుడు
పాత సీనియారిటీకి రక్షణ కల్పించాలి
మూడుదశాబ్దాలు టీచర్లుగా సేవలందించిన వారి సీనియారిటీని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. బలమైన కారణాలతోనే ఆర్థిక నష్టాన్ని భరించి వారు రివర్షన్ తీసుకున్నారు. వారి సర్వీసును సున్నా చేయ డం చట్టవిరుద్ధం. విద్యాశాఖ అధికారులు సవరించిన నిబంధనలతో కొత్త సీనియారిటీ జాబితాలు విడుదల చేయాలి. – గంటామోహన్,
ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు


