చిత్తూరు కలెక్టరేట్ : మాతృ మరణాల నివారణే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. ఆయన గురువారం వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇటీవల జరిగిన మూడు (తవణంపల్లి పీహెచ్‌సీ, పెనుమూరు పీహెచ్‌సీ, పుదుపేట యూపీహెచ్‌సీ) మాతృమరణాలపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ మాతా శిశు సంరక్షణే ధ్యేయంగా పీహెచ్‌సీల పరిధిలో గర్భిణుల నమోదు ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలన్నారు. మెడికల్ ఆఫీసర్లు తమ పరిధిలోని ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు బాధ్యతాయుతంగా పనిచేసేలా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరగాలన్నారు. బలమైన కారణాలు ఉంటేనే ఇతర ఆస్పత్రులకు సిఫార్సు చేయాలని ఆదేశించారు. వాటిపై నివేదికలు సిద్ధం చేసి అధికారులకు అందజేయాలన్నారు. ఆర్‌సీహెచ్ కార్యక్రమంలో గర్భిణుల నమోదు, వారికి సేవలను కచ్చితత్వంతో పూర్తిస్థాయిలో అందించాలన్నారు. గర్భం దాల్చిన సమయం నుంచి కాన్పు జరిగే వరకు ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అంగన్‌వాడీల్లో ఇచ్చే పౌష్టికాహారాన్ని నిరంతరం తనిఖీ చేయాలని ఆదేశించారు.
హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేక నిఘా
జిల్లాలో హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేక నిఘా పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. వారికి రక్తహీనత లేకుండా బీపీ, షుగర్, హై బీపీ చెక్ చేస్తూ అవసరమైతే సుక్రోజ్ ఇంజెక్షన్లను ఇప్పించాలన్నారు. పుట్టిన ప్రతి బిడ్డను సకాలంలో రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశించారు. తద్వారా నిర్దేశిత సమయంలో వ్యాక్సినేషన్ వేసి ఆరోగ్య స్థితిని పరిశీలించేందుకు అవకాశం ఉంటుందన్నారు. భవిష్యత్‌లో మాతృమరణాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ సమీక్షలో డీఎంహెచ్‌వో నాగభూషన్‌రెడ్డి, ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరి, అడిషనల్ డీఎంహెచ్‌వో వెంకటప్రసాద్, డీసీహెచ్‌ఎస్ పద్మాంజలిదేవి తదితరులు పాల్గొన్నారు.


