తిరుపతికి వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం!
సీఎం చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరుకు కొత్తగా ప్రభుత్వ కార్యాలయాలు రావడం లేదు. ఉన్న వాటిని కూడా తిరుపతికి తరలించడానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. ఘన చరిత్ర కలిగిన వాణిజ్య పన్నుల శాఖ (సీటీ) కార్యాలయాన్ని తిరుపతికి తరలించడానికి రంగం సిద్ధమైంది. జీఓ సైతం విడుదలైంది. అధికారులు ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. కార్యాలయ సామగ్రి తరలించడానికి 5 లారీలు కావాలని సమాచారం ఇచ్చినట్టు తెలిసింది.
చిత్తూరు కార్పొరేషన్: జిల్లా కేంద్రమైన చిత్తూరులోని మార్కెట్ చౌక్‌లో 1976లో సీటీ డీసీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తదుపరి నాయుడు బిల్డింగ్స్‌కు మారగా, 2004 నుంచి ప్రస్తుతం కార్యాలయంలో అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. అప్పట్లో చిత్తూరు, కడప జిల్లాల పాలన చిత్తూరు కేంద్రంగా సాగేది. జిల్లాల పునర్ విభజనకు ముందు చిత్తూరు 1, 2, మదనపల్లె, పుత్తూరు, తిరుపతి 1, 2 స్పెషల్ సర్కిల్ కార్యాలయాలు ఉండేవి. జిల్లాలు వేరయ్యాక చిత్తూరు 1, 2, పలమనేరు, తిరుపతి 1, 2, 3, శ్రీకాళహస్తి, శ్రీసిటీ, గూడూరు సర్కిళ్లు జేసీ పరిధిలోకి వచ్చాయి. చిత్తూరు జిల్లాలోని జేసీ, డీసీ(డిప్యూటీ కమిషనర్), చిత్తూరు 1, 2 పలమనేరు ఏసీ కార్యాలయాలు కట్టమంచిలోని ఒకే భవనం నుంచి సేవలు అందిస్తున్నాయి. తిరుపతిలో రీజనల్ కార్యాలయం ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు అందరూ ఒకే చోట ఉంటే రాష్ట్ర అధికారులకు సౌకర్యంగా ఉంటుందని భావించి జేసీ కార్యాలయాన్ని తిరుపతికి మారుస్తున్నారన్న వాదన ఉంది.
గతంలో ఆపిన మాజీ మంత్రి పెద్డిరెడ్డి
గత ప్రభుత్వంలోనే కార్యాలయాన్ని తిరుపతికి మార్చాలన్న నిర్ణయాన్ని అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిలిపివేయించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తిరిగి ఈ అంశం తెర మీదకు వచ్చింది. కచ్చితంగా కార్యాలయాన్ని మార్చాలని ఉన్నతాధికారులు కంకణం కట్టుకున్నట్టు తెలిసింది.
ఇబ్బందులు
ఉద్యోగుల్లో ఐకమత్యం లేకుండా చేయాలని..
ఇటీవల తిరుపతిలో సమావేశానికి వచ్చిన ఆ శాఖ రాష్ట్ర అధికారి జేసీ కార్యాలయాన్ని తనిఖీ చేయాలని భావించి అధికారులకు సూచించారు. వారు చిత్తూరుకు వెళ్లాలని చెప్పడంతో అక్కడికి బదులు కార్యా లయాన్ని తిరుపతికి మార్చాలని ఆదేశించినట్లు సమాచారం. దీనికితోడు సమస్యలపై ఉద్యోగులు వారం రోజులు పాటు నిరసన తెలిపారు. దానిపై ఆగ్రహం చెందిన ఆ అధికారికి చిత్తూరులో జిల్లా కా ర్యాలయం ఉండరాదని మొండి పట్టు పట్టినట్లు తెలి సింది. కార్యాలయం మార్పు జరిగితే ఉద్యోగులు చెల్లాచెదురై ఐక్యత లేకుండా పోతుందనే ఈ నిర్ణ యం తీసుకున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. దీని పై వ్యాపారులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత జిల్లాలో కాదని కొత్తగా ఏర్పడిన జిల్లాలోకి కా ర్యాలయాన్ని మార్చాల్సిన అవసరమేమిటని ప్రశ్నిస్తున్నారు. తిరుపతిలో ఇప్పటికే రీజనల్, ఏజేసీ, తిరుపతి 1, 2, 3 ఏసీతో మొత్తం 5 కార్యాలయాలున్నాయని, ఇప్పుడు చిత్తూరు నుంచి జేసీ, డీసీ కార్యాలయాలను మార్చే అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నిస్తున్నారు.


