ఓ తల్లి ముందు‘చూపు’!
● కొడుకు నేత్రాలను దానం చేసిన మాతృమూర్తి
చిత్తూరు రూరల్(కాణిపాకం): కన్న కొడుకు మృతితో కన్నీళ్లు కార్చిన ఓ తల్లి.. చివరకు ఆ కొడుకు కళ్లు దానం చేసి మరొక్కరికి చూపు ఇవ్వాలని నిర్ణయించుకుంది. మంగళవారం జిల్లా ప్రభుత్వాస్పత్రిలో మృతిచెందిన కొడుకు కళ్లు దానం చేసి ఆదర్శంగా నిలిచింది. వివరాలు.. చిత్తూరు నగరం, రంగాచారి వీధికి చెందిన రాహుల్ (18) బీకామ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి వెంకటేష్ కరోనా కాలంలో మృతిచెందగా.. తల్లి అమ్ము దినసరి కూలీగా పనిచేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. డిసెంబర్ 31వ తేదీన రాహుల్ ద్విచక్ర వాహనంపై వెళుతూ మురకంబట్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. రాహుల్ తలకు తీవ్రగాయాలయ్యా యి. వెంటనే స్థానికులు ఆ యువకుడిని చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో గాయపడ్డ యువకుడిని మెరుగైన చికి త్స నిమిత్తం తమిళనాడులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స అందించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. దీంతో బంధువులు ఈనెల 2వ తేదీ చిత్తూరు జిల్లా ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చేశారు. ఇక్కడ వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తుండంగా.. మంగళవారం ఆ యువకుడు మృతిచెందాడు. మృతుడి తల్లి తన కుమారుడి అవయవాలు దానం చేయాలని నిర్ణయించుకుంది. చివరకు కొడుకు కళ్లు అయినా దానం చేసి ఇంకొక్కరికి చూపు ఇవ్వాలని భావించింది. ఈ మేరకు చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో కుమారుడి కళ్లు దానం చేయించింది.


