గుజ్జు..బతుకు నుజ్జు!
ఆరు నెలలుగా అవస్థలు
పట్టించుకోని గుజ్జు పరిశ్రమల నిర్వాహకులు
పోరుకు సిద్ధమైన అన్నదాతలు
కాణిపాకం: జిల్లాలో 56వేల హెక్టార్లల్లో మామిడి సాగవుతోంది. ఇందులో తోతాపురి 39,895 హెక్టా ర్లు, నీలం 5,818 హెక్టార్లు, అల్పోన్సో 3,127 హెక్టా ర్లు, బేనీషా 3,895 హెక్టార్లు, మల్లిక 1,740 హెక్టా ర్లు, ఇతర రకాలు 1,526 హెక్టార్లల్లో సాగవుతున్నా యి. గతేడాది మే నుంచి మామిడి కోతలు మొదలయ్యాయి. టేబుల్ రకం మాత్రం మే 15 తర్వాత కోతలు కోసి విక్రయించుకున్నారు. తోతాపురి జూన్‌లో కోతలు ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలో దిగుబడిని ఆసరాగా చేసుకుని ఫ్యాక్టరీలన్నీ సిండికేట్ అయ్యి.. రేట్లు తగ్గించేశాయి.
ప్రభుత్వ గిట్టుబాటు ధర ఇదీ
జిల్లాలోని పలు ఫ్యాక్టరీలు మామిడి రైతులను చిత్రహింసలకు గురిచేశాయి. కాయలు కొనుగోలు చేయలేమని చేతులెత్తేశాయి. మరికొన్ని ఫ్యాక్టరీలు కేజీ తోతాపురి రూ.4, రూ.5, రూ.6 అంటూ పాటపాడాయి. దీనిపై రైతులు తిరుబాటు ఎగురవేశారు. చంద్రబాబు ప్రభుత్వం దిగొచ్చి మామిడికి గిట్టుబాటు ధరను ప్రకటించింది. ఫ్యాక్టరీలు కేజీకి రూ.8 చొప్పున్న చెల్లించాలని ఆదేశాలు జారీచేసింది.
ఉద్యమ బాట
చంద్రబాబు ప్రభుత్వం మామిడి రైతు కష్టాలు, గిట్టుబాటు ధరను పట్టించుకోకపోవడంతో జిల్లా లోని రైతులంతా ఉద్యమ బాట పడుతున్నారు. ఇది వరకు పలుమార్లు కలెక్టరేట్‌ను ముట్టడించారు. గుడిపాల మండలంలోని కొత్తపల్లి వద్ద ఉన్న ఓ ఫ్యాక్టరీ రూ.3, రూ.4 చెల్లిస్తోందని రోడెక్కారు. అదే ఫ్యాక్టరీకి సోమవారం రైతులంతా కలిసి తాళం వేశారు. నవంబర్‌లో చిత్తూరు మండలం, చెర్లోపల్లి వద్ద ఉన్న ఫ్యాక్టరీకి బంగారుపాళ్యంకు చెందిన రైతులు చేరుకుని ధర్నా చేశారు. బుధవారం జీడీనెల్లూరు మండలంలోని ఓ ఫ్యాక్టరీకి తాళం వేయడానికి సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు రైతులను అడ్డగించే ప్రయత్నం చేస్తున్నారు. గిట్టుబాటు ధర ఇచ్చేంత వరకు తమ ఉద్యమం ఆగదని రైతు నాయకులు తేల్చి చెబుతున్నారు.
గిట్టుబాటు ధరకు ఎసరు?
రైతులు ఫ్యాక్టరీలకు కాయలు తోలి ఆరు నెలలు గడించింది. ఇంతవరకు చాలా ఫ్యాక్టరీలు రైతులకు చిల్లిగవ్వ చెల్లించ లేదు. కొన్ని ఫ్యాక్టరీలు కేజీకి రూ.3, రూ.4 చెల్లించడంతో రైతుల కడుపు మండిపోతోంది. ఈ విషయం ప్రభుత్వం దృష్టికెళ్లినా చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. ఫ్యాక్టరీలతో ప్రభుత్వం సిండికేట్ అయ్యిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈ కారణంగానే ఫ్యాక్టరీలు గిట్టుబాటు ధరను పట్టించుకోకుండా సొంత ధరను నిర్ణయించాయి. ఈ చెల్లింపుపై చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సిండికేట్ వెనుక ఎవరెవరున్నారని, ఎందుకు రైతులను ఇలా చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మామిడి రైతులకు
అందని బకాయిలు
తమిళనాడు కాయలకు ప్రాధాన్యం
మామిడిలో టేబుల్ రకాలను పక్కన పెడితే జిల్లాలో అధికంగా తోతాపురి సాగువుతోంది. దాదాపు 39,895 హెక్టార్లు ఉండగా.. గతేడాది 4.99లక్షల మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి వచ్చింది. అందుకు తగ్గట్టు కొనుగోలుకు ఫ్యాక్టరీలు ఆసక్తి చూపలేదు. తమిళనాడు కాయలకు ప్రాధాన్యతనిచ్చా యి. రైతులంతా పోరుబాట పట్టడంతో జిల్లా యంత్రాంగం స్పందించింది. ఈ నేపథ్యంలో 46 ఫ్యాక్టరీలుంటే 31 ఫ్యాక్టరీలు కాయలు కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చాయి. దిగుబడిని సాకుగా చూపించి ధరలను తగ్గించేశాయి. దీంతో రైతులు రోడెక్కాల్సి వచ్చింది.


