తాసా..ముంచేశా! | - | Sakshi
Sakshi News home page

తాసా..ముంచేశా!

Jan 6 2026 7:30 AM | Updated on Jan 6 2026 7:30 AM

తాసా.

తాసా..ముంచేశా!

ఆరు నెలలైనా ఇంతవరకు నయాపైసా విడుదలచేయని వైనం

ఆందోళనలో అన్నదాతలు

జ్యూస్‌ ఫ్యాక్టరీకి తాళం వేసి ధర్నా

గుడిపాల: ‘తాసా జ్యూస్‌ ఫ్యాక్టరీ మామిడి రైతులతో ఆడుకుంటోంది. మామిడి కాయలు ఫ్యాక్టరీకి తోలి ఆరు నెలలైనా ఇంతవరకు పైసా కూడా విడుదల చేయకుండా వేధిస్తోంది. రైతులంటే ఫ్యాక్టరీ యాజమాన్యానికి లెక్కలేకుండా పోయింది..’ అంటూ రైతులు మండిపడ్డారు. దీని పై సోమవారం బాధిత రైతులు ఉద్యమబాట పట్టారు. గుడిపాల మండలంలోని 189 కొత్తపల్లె వద్ద ఉన్న తాసా జ్యూస్‌ ఫ్యాక్టరీ వద్ద ధర్నాకు ఉపక్రమించారు. గతంలో మామిడి కాయలు తోలిన ఇరవై రోజులకే రైతులకు నగదు అందజేసే వారని, ప్రస్తుతం నగదు ఇవ్వకుండా కాలయాపన చేయడం ఏంటని ప్రశ్నించారు. గతంలో మామిడికి గిట్టుబాటు ధర రూ.8 ఇస్తామని చెప్పారని.. ప్రస్తుతం రైతులను పిలిపించుకొని రూ.4 ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

మీకెందుకు అంతకష్టం

మేము కష్టపడి ఆరుగాలం శ్రమించి మామిడి పంటను కోసి ఫ్యాక్టరీకి తోలితే మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వడానికి మీకెందుకు అంతకష్టం. అన్ని ఫ్యాక్టరీలు మామిడికి డబ్బులు ఇస్తే ఎందుకు ఇంతవరకు కాలయాపన చేస్తున్నారు. ప్రస్తుతం మామిడికి అన్ని ఫ్యాక్టరీలు రూ.8 ఇస్తున్నాయి. మీరు ఎందుకు రూ.4మాత్రమే ఇస్తామని చెబుతున్నారు. రూ.8తో కలిపి అదనంగా ఒక రూపాయి వేసి రూ.9 ఇవ్వాల్సిందే. లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తాం.

– శ్రీనివాసులు, రైతు,

చీలాపల్లె, గుడిపాల

మళ్లీ అప్పుచేయాల్సిందే

ఫ్యాక్టరీకి మామిడి పంటను తోలి ఆరు నెలలైంది. మళ్లీ సీజన్‌ వస్తోంది. దుక్కులు దున్ని, మందులు పిచికారీ చేయాలి. ఇంతవరకు మామిడి తోలిన డబ్బులు రాలేదు. అప్పుచేయాల్సిన పరిస్థితి నెలకుంటోంది. 15 టన్నులు మామిడిని తోలాను. ఫ్యాక్టరీ చుట్టూ తిరిగినా ఫలితం లేదు. ఇప్పుడేమో రూ.4 లెక్కన ఇస్తామని చెబుతున్నారు. వాళ్లు రూ.4 ఇస్తే కూలీలు, బాడుగలకే చాలదు. కచ్చితంగా రూ.8 ఇవ్వాల్సిందే.

– చిట్టిబాబు, రైతు, దళవాపల్లె, గుడిపాల

20 టన్నులు తోలాను

నేను తాసా జ్యూస్‌ ఫ్యాక్టరీకి 20 టన్నులు మామిడిని తోలాను. ఇప్పటికి ఆరు నెలలైంది. పక్కనే ఉన్న ఫుడ్‌ అండ్‌ ఇన్స్‌ జ్యూస్‌ ఫ్యాక్టరీలో రైతుకు కిలో మామిడికి రూ.8 అందజేశారు. ఇక్కడ ఇంతవరకు ఒక్క నయాపైసా కూడా ఇవ్వలేదు. అడిగితే రూ.4 చెక్కు రూపంలో అందజేస్తామని చెబుతున్నారు. అదికూడా ఇంతవరకు ఇవ్వలేదు. రూ.8 ఇస్తేనే మేము తీసుకుంటాము. రైతులంటే ఎందుకు ఇంత చిన్న చూపు. – జగధీశ్వరనాయుడు, తుమ్మలవారిపల్లె, రైతు, గుడిపాల

మామిడి రైతులను ముంచేసిన తాసా జ్యూస్‌ఫ్యాక్టరీ

అదే మా కొంప ముంచింది

గతంలో తాము ధర్నా చేసినప్పుడు అధికారులు వచ్చి తమకు న్యాయం చేస్తామని చెప్పడంతో వారిని నమ్మామని, ఇప్పుడు తీరా వారు చేతులెత్తేశారని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలోని అన్ని జ్యూస్‌ ఫ్యాక్టరీలలో మామిడి కిలోకు రూ.8 ఇవ్వడం జరిగిందని, ఇక్కడ మాత్రం ఎందుకు ఇవ్వలేదని వారు తాసా జ్యూస్‌ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ఫ్యాక్టరీని మూసివేస్తేనే మీరు తమ మాట వింటారని రైతులందరూ మూకుమ్మడిగా ఫ్యాక్టరీకి తాళాలు వేశారు. తమకు డబ్బులిచ్చేంత వరకు ఫ్యాక్టరీని తెరిపించేది లేదని భీష్మించుకున్నారు. గుడిపాల తహసీల్దార్‌ శ్రీనివాసులు, డీఎస్పీ సాయినాఽథ్‌ ఒకవైపు ఫ్యాక్టరీ యాజమాన్యం, మరోవైపు రైతులతో మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది.

తాసా..ముంచేశా! 1
1/2

తాసా..ముంచేశా!

తాసా..ముంచేశా! 2
2/2

తాసా..ముంచేశా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement