ఇదెక్కడి రూల్స్ సామీ!
రెస్కోలో నూతన విధానం
రోజురోజుకూ మితిమీరుతున్న
కూటమి నేతల నిబంధనలు
బాబు నియోజకవర్గంలో ఇదీ పరిస్థితి
సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూటమి నేతలు చెలరేగిపోతున్నారు. తాము చెప్పిందే వేదమని.. అలాగే నడుచుకోవాలని అధికారుల మెడపై కత్తిపెడుతున్నారు. ఏ మాత్రం అతిక్రమించినా అందరి ఎదుటే వారిపై చిందులు తొక్కడం.. బదిలీ వేటు వేయడం ఇట్టే అలవాటు చేసుకుంటున్నారు. ఇలాంటిదే కుప్పం రెస్కోలో అమలు చేస్తున్నారు. కొత్త విద్యుత్ మీటర్ తీసుకోవాలంటే కూటమి నేతల నుంచి సిఫార్సు లేఖ ఉండాలని హుకుం జారీచేశారు. లేకుంటే కొత్త విద్యుత్ మీటరు ఇవ్వరాదని అధికారులను హెచ్చరిస్తున్నారు. సిఫార్సు లేఖలు సంపాదించలేక.. కూటమి నేతలను ప్రసన్నం చేసుకోలేక సామాన్య, మధ్యతరగతి వినియోగదారులు తిరిగి తిరిగి అలసిపోతున్నారు.
కుప్పం: పరిపాలన పరంగా రాష్ట్రమంతా ఒక విధానాన్ని కొనసాగిస్తుంటే.. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో మాత్రం మరో విధంగా ముందుకెళ్తున్నారు. ఇక్కడ కూటమి నేతలు చెప్పిందే వేదంగా అధికారులు సైతం నడుచుకుంటున్నారు. వారి అడుగులకు మడుగులొత్తుతూ పేదల సమస్యలను గాలికొదిలేస్తున్నారు.
కుప్పం గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ (రెస్కో) పరిధిలో ఉన్న కుప్పం నియోజకవర్గంలో ఎవరైనా కొత్తగా విద్యుత్ మీటర్ కావాలంటే స్థానికంగా ఉన్న కూటమి నేతల సిఫార్సు లేఖ తీసుకురావాలి. లేదంటే వారి వద్ద నుంచి అధికారులకు ఫోన్లు చేసి చెప్పారు. ఈ నిబంధనను రెస్కోలో తప్పనిసరి చేశారు. సాధారణంగా విద్యుత్ మీటర్ కోసం స్థానికంగా ఉన్న సచివాలయంలో నమోదు చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ నోఅబ్జెక్షన్ (ఎన్‌ఓసీ) సర్టిఫికెట్‌తో పాటు సంబంధిత అధికార పార్టీ నేతల సంతకాలు తప్పని సరిగా ఉండాలని రెస్కోలో పనిచేస్తున్న పై స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి లైన్‌మన్ల వరకు హుకుం జారీ చేస్తున్నారు. దీంతో వినియోగదారులు అవాక్కవుతున్నారు.
రెస్కోలో విద్యుత్ మీటర్‌కు నగదు చెల్లిస్తే మీటర్‌ను సంబంధిత సిబ్బంది అందిస్తారు. దీనిపై స్థానిక నాయకుల సంతకాలు ఎందుకో అర్థం కావడం లేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. 1 కేవీ విద్యుత్ మీటర్‌కు 1,700 చెల్లించాలి. దీని ప్రకారం ఎన్ని కేవీలు కావాలంటే అంత డబ్బు చెల్లిస్తే సరిపోతుంది. దీనికి స్థానికంగా ఉన్న నాయకుడి సంతకం ఎందకని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని విస్మరించినందుకు గత నాలుగు రోజు క్రితం మున్సిపాలిటీ పరిధిలోని ఐదో వార్డులో ఓ టీడీపీ నేత సబంధిత రెస్కో ఉద్యోగిపై చిందులు తొక్కినట్టు సమాచారం. తమకు తెలియకుండా విద్యుత్ మీటరు ఎలా ఇస్తారంటూ నిలదీసినట్టు తెలుస్తోంది. ఇది పట్టణంలో హాట్ టాపిక్‌గా మారింది. మున్సిపాలిటీ పరిధిలోనే కాకుండా గ్రామాల్లో సైతం ఈ కొత్త రూల్ అమలు చేస్తున్నట్టు పలువురు పేర్కొంటున్నారు.
కుప్పంలోని రెస్కో సంస్థ పాలన గాడి తప్పుతోంది. గతంలో ఇక్కడ పనిచేస్తున్న మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) బదిలీపై వెళ్లారు. ఆయన వెళ్లి ఆరు నెలలవుతున్నా ఇంతవరకు ఆ పోస్టును భర్తీ చేయలేదు. రెస్కో పాలనపై ప్రస్తుతం ఉన్న పాలకవర్గం పట్టుకోల్పోయింది. దీంతో సమస్యలు ఎక్కడికక్కడ పేరుకుపోతున్నాయి. పాలకవర్గ సభ్యుల్లో సైతం సమన్వయం లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.
రెస్కో ఎండీ పోస్టుకు పోటాపోటీ
కుప్పం రెస్కో సంస్థ ఎండీ పోస్టుకు తీవ్రమైన పోటీ నెలకొంది. సాధారణంగా ట్రాన్స్‌కో నుంచి సీనియర్ ఇంజినీరింగ్ అధికారిని ఎండీగా నియమిస్తారు. దీంతో పలువురు ఆశావహులు పోటాపోటీగా తమ ప్రయత్నాల్లో మునిగితేలుతున్నట్టు సమాచారం.
గాడితప్పిన రెస్కో పాలన
సిఫార్సు లేఖ ఉంటేనే
కొత్త విద్యుత్ మీటర్
కొత్త విద్యుత్ మీటర్ కావాలంటే
ఎందుకో ఇలా..


