బాబు తప్పుడు విధానాలే గెలిపిస్తాయి!
బాబు, పవన్, లోకేష్‌తో జనం బేజారు
రెండేళ్ల పాలనను ప్రజలు గ్రహించారు
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
పుంగనూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజావ్యతిరేక విధానాలు, తప్పుడు హామీలతో ప్రజలు విసిగిపోయి వైఎస్సార్‌సీపీ సమావేశాలకు తండోపతండాలుగా తరలివస్తున్నారని, వైఎస్సార్‌సీపీ అత్యధిక మెజార్టీతో విజయం సాధించి, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టడం ఖాయమని మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. పుంగనూరు మండలంలో శుక్రవారం ఎంపీ రెడ్డెప్పతో కలసి పెద్దిరెడ్డి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నల్లరాళ్లపల్లె గంగమ్మగుడి వద్ద ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రెండేళ్ల పాలనలో అనేక అబద్ధాలు చెప్పి, ప్రజలను మోసగించారని మండిపడ్డారు. మోసాలు చేసి, అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన మేరకు సూపర్–6 ఎక్కడా అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర లేక వలసలు వెళ్లే పరిస్థితి దాపురించిందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తున్న ఘనత టీడీపీదేనని ఆరోపించారు. అథోగతిపాలవుతున్న రాష్ట్రాన్ని తిరిగి కాపాడే కార్యక్రమాన్ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భుజస్కంధాలపై వేసుకోవాలని అవసరం ఉందన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి అన్ని హామీలు నేరవేర్చారని గుర్తుచేశారు. రెండేళ్లు కరోనా సమయంలో కూడా ప్రజలకు ఇచ్చిన మాటను తూచ తప్పకపాటించారని కొనియాడారు. రెండేళ్ల చంద్రబాబు పాలన ఎలా ఉందో ప్రజలు గ్రహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. వైఎస్సార్‌సీపీని గెలిపించే పరిస్థితులను చంద్రబాబు, ఆయన కోటగిరీ రాష్ట్రంలో చేపట్టడం అభినందనీయమన్నారు. ఎంపీపీ భాస్కర్‌రెడ్డి, పీకేఎం ఉడా మాజీ చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, పార్టీ మండల అధ్యక్షుడు అమరనాథరెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు అనీషారెడ్డి, కొండవీటి నాగభూషణం, శ్రీనాథరెడ్డి, జిల్లా యూత్‌వింగ్ కన్వీనర్ కొత్తపల్లె చెంగారెడ్డి, ఉమ్మడి జిల్లా ఐటీవింగ్ ఇన్‌చార్జ్ ప్రకాష్‌రెడ్డి పాల్గొన్నారు.
చంద్రబాబుకు కృతజ్ఞతలు
బాబు తప్పుడు విధానాలే గెలిపిస్తాయి!


