వేగంగా కేసుల పరిష్కారం
చిత్తూరు కలెక్టరేట్ : కోర్టు కేసులను త్వరితగతిన పరిష్కరించాలని డీఆర్‌వో మోహన్‌కుమార్ ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. డీఆర్‌వో మాట్లాడుతూ కోర్టుల్లో నమోదైన కేసుల పట్ల అధికారులు అలసత్వం వహించకూడదన్నారు. ఎప్పటికప్పుడు కోర్టు కేసులపై స్పందించాలన్నారు. పీజీఆర్‌ఎస్‌లో నమోదైన అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. 24 గంటల్లోపు ప్రతి అర్జీనీ ఓపెన్ చేసి పరిశీలించాలన్నారు.
కరెంట్ సమస్యల పరిష్కారం
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో శుక్రవారం నిర్వహించిన కరెంటోళ్ల జనబాట కార్యక్రమంలో 116 సమస్యలను పరిష్కారించినట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఇస్మాయిల్‌అహ్మద్ తెలిపారు. ఇందులో భాగంగా 11 కేవీ లైన్ సమస్యలు 404లో 50 పరిష్కరించామని, ఎల్‌టీ లైన్, సర్వీసు లైన్ పరంగా 490 సమస్యలు రాగా అందులో 66 పరిష్కారించినట్టు వెల్లడించారు.
ఇంటింటా ఫీవర్ సర్వే
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరం మాపాక్షిలోని గాజులపల్లెలో శుక్రవారం వైద్య సిబ్బంది ఇంటింటా ఫీవర్ సర్వే చేశారు. గ్రామంలో అబేట్ పిచికారీ చేశారు. జిల్లా మలేరియా అధికారి వేణుగోపాల్ జ్వరాల కేసులపై ఆరా తీశారు. స్క్రబ్ టైఫస్ కేసుల రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సిబ్బంది రామకృష్ణ, నారాయణ, రాణి, హేమలత, సరసమ్మ తదితరులు పాల్గొన్నారు.
జనవరి 5 నుంచి ఎఫ్‌ఏ–3 పరీక్షలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో జనవరి 5 నుంచి ఫార్మేటీవ్ అసెస్‌మెంట్–3 (ఎఫ్‌ఏ–3) పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు జారీచేశారు. ఆ షెడ్యూల్ మేరకు జిల్లా వ్యాప్తంగా 1 నుంచి 5వ తరగతి వరకు జనవరి 5 నుంచి 7వ తేదీ వరకు, 6 నుంచి 10వ తరగతి వరకు 8వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
శ్రీవారి దర్శనానికి
24 గంటలు
తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు 72,255 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 37,154 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుక ల రూపంలో హుండీలో రూ.4.12 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కె ట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంట ల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇది లా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలో కి అనుమతించరని స్పష్టంచేసింది.
కల్కి ట్రస్టు ఆక్రమిత భూములపై విచారణకు ఆదేశం
వరదయ్యపాళెం: కల్కిట్రస్టు పరిధిలో ఆక్రమిత అటవీ, ప్రభుత్వ డీకేటీ భూముల వివరాలపై విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. ఈ మేరకు సూళ్లూరుపేట ఆర్డీఓకు ఆదేశాలు జారీ చేస్తూ బీఎన్‌కండ్రిగ, వరదయ్యపాళెం మండల తహసీల్దార్‌లకు ఉత్తర్వులు పంపారు. ఇటీవల కల్కి ట్రస్టు భూముల ఆక్రమణపై భారత హేతువాద సంఘం అధ్యక్షుడు నార్ని వెంకటసుబ్బయ్య, అటవీశాఖ మంత్రికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు స్పందించిన జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఆ మేరకు అంజూరు అటవీ ప్రాంతంలో 21 ఎకరాలు, అలాగే వరదయ్యపాళెం మండలం బత్తలవల్లంలోని ప్రభుత్వ డీకేటీ భూముల ఆక్రమణ గురించి విచారణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
హైకోర్టు కేంద్ర ప్రభుత్వ
స్టాండింగ్ కౌన్సిల్‌గా పెల్లేటి
కోట: రాష్ట్ర హైకోర్టు కేంద్రప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్‌గా పెల్లేటి రాజేష్‌కుమార్‌ను నియమిస్తూ కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాజేష్‌కుమార్ తిరుపతి జిల్లా, గూడూరు నియోజకవర్గం, కోటకు చెందిన సీనియర్ న్యాయవాది పెల్లేటి గోపాల్‌రెడ్డి కుమారుడు. రాజేష్‌కుమార్ ఇప్పటికే రాష్ట్ర హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మరోసారి కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమించినట్లు ఆయన తండ్రి గోపాల్‌రెడ్డి తెలిపారు.


