డీకే చుట్టూ చర్చ!
చిత్తూరు అర్బన్: చిత్తూరుకు చెందిన మాజీ పార్లమెంటు సభ్యులు డీకే.ఆదికేశవులు నాయుడు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ పిల్లలైన డీఏ.శ్రీనివాస్, డీఏ.కల్పజ అరెస్టు వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఆదికేశవులునాయుడుకు సన్నిహితుడైన రఘునాథ్ అనుమానాస్పద స్థితిలో మృతి కేసులో శ్రీనివాస్, అతని అక్క కల్పజను సోమవారం సాయంత్రం అరెస్టు చేసినట్లు సీబీఐ ప్రటకన విడుదల చేసింది.
బెంగళూరుకు చెందిన రియలర్ట్ కె.రఘునాథ్ 2019 మేలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అయితే తన భర్త మృతికి కారణం శ్రీనివాస్ తదితరులేనంటూ మృతుడి భార్య మంజుల పోలీసులను ఆశ్రయించారు. తప్పుడు వీలునామా సృష్టించి, తన భర్త చనిపోయేముందు ఆస్తులను బదిలీ చేయాలని బలవంతం చేశారని.. మంజుల ఫిర్యాదు చేశారు. తొలుత బెంగళూరు పోలీసులు, ఆపై సిట్ కేసు నమోదు చేసి శ్రీనివాస్ తదితరులకు క్లీన్‌చిట్ ఇచ్చింది.
దీన్ని సవాలు చేస్తూ మంజుల, ఆమె కుమారుడు రోహిత్ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాల మేరకు 2022లో కేసును సీబీఐకి అప్పగించారు. కేసు విచారణను ఎనిమిది నెలల్లో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆదేశాలు జారీచేసింది. ఇందులో భాగంగా కల్పజ, శ్రీనివాస్‌ను సీబీఐ పోలీసులు అరెస్టు చేశారు. ఆదికేశవులు నాయుడు, ఆయన భార్య సత్యప్రభ చిత్తూరుకు చెందిన వాళ్లు కావడం.. ఇక్కడే రాజకీయ పదవులు అనుభవించడంతో ఈ వార్త నగరంలో దావానంలా వ్యాపించింది. శ్రీనివాస్, కల్పజను అరెస్టు చేశారంటూ పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
ఇక నిందితులు ఇద్దరితో పాటు బెంగళూరు డీఎస్పీ మోహన్‌ను సైతం అరెస్టు చేసి బెంగళూరు కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండు విధించింది. నిందితులు ముగ్గురినీ ఏడు రోజుల పాటు సీబీఐ పోలీసుల కస్టడీకి అనుమతిస్తూ బెంగళూరు కోర్టు ఆదేశాలు జారీచేసింది. గతవారం ఆదికేశులు నాయుడు సోదరుడు బద్రీనారాయణ మృతి చెందగా, అంత్యక్రియలకు.. పెద్దకర్మకు శ్రీనివాస్, కల్పజ తదితరులు చిత్తూరులో కనిపించారు. తాజాగా వీళ్ల అరెస్టు రాజకీయన వర్గాల్లో టాక్ ఆఫ్ టౌన్‌గా మారింది.
డీకే చుట్టూ చర్చ!


