అభివృద్ధి.. సంక్షేమమే అజెండా | Sakshi
Sakshi News home page

అభివృద్ధి.. సంక్షేమమే అజెండా

Published Fri, Apr 19 2024 1:55 AM

మాట్లాడుతున్న  మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పక్కన ఎమ్మెల్యే అభ్యర్థి భరత్‌  - Sakshi

శాంతిపురం: కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి.. సంక్షేమమే అజెండాగా ముందుకు వెళుతున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. గురువారం శాంతిపురం, రామకుప్పం మండలాల పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ కుప్పం భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్‌సీపీ ని ఆశీర్వదించాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్‌ ఇచ్చి న మాట ప్రకారం హంద్రీ–నీవా కాలువ ద్వారా నీరందించారన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు కాలువను ప్రారంభించాక వచ్చి ఎల్లో మీడియా ద్వారా అబద్ధాలు వల్లించి వెళ్లారని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో కుప్పం ప్రజలు అంచనాలకు మించి వైఎస్సార్‌సీపీ అండగా నిలిచారని, ఇదే ఒరవడి ని కొనసాగిస్తూ భరత్‌ను సైతం గెలిపిస్తారని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు మరో 20 రోజులు శ్రమిస్తే భరత్‌ గెలవడం, మంత్రి కావడం సులువుగా జరిగిపోతాయని చెప్పారు. ప్రతి కార్యకర్తకు అండగా నిలిచి, వారిని కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు.

సీమ ద్రోహి చంద్రబాబు

చంద్రబాబు తాను పుట్టి, పెరిగిన రాయలసీమకు తీరని ద్రోహం చేశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. ఓటుకు కోట్లు కేసు కోసం ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శించారు. ఎన్నికల హామీలను అమలు చేసి, ప్రతి కుటుంబానికి మేలు చేసి, తన ఐదేళ్ల పాలనలో మంచి జరిగి ఉంటేనే తనకు ఓటు వేయాలని చెప్పిన దమ్మున్న నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి అని వివరించారు. ఈ మాట చెప్పే ధైర్యం 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబుకు ఉందా ? అని ప్రశ్నించారు. అది లేకనే సూపర్‌ సిక్స్‌, బాబు గ్యారెంటీ అంటూ మళ్లీ మోసం చేసేందుకు వస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్‌ మాట్లాడుతూ గతంలో నామినేషన్‌ వేయడానికి, ఓట్లు అడగడానికి కూడా కుప్పానికి రాకుండా చంద్రబాబు ఓటర్లను అవమానించారని విమర్శించారు. ఇప్పుడు ఓటమి భయంతోనే కుప్పం బాట పడుతున్నారని ఆరోపించారు. 35 ఏళ్లుగా పట్టించుకోని వ్యక్తి మళ్లీ అవకాశం ఇస్తే ఐదేళ్లలో అభివృద్ధి చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కుప్పం రాజకీయ చరిత్రను తిరగరాసేందుకు పార్టీ శ్రేణులతో కలిసి కృషి చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్‌ సుబ్రమణ్యంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నరేష్‌కుమార్‌రెడ్డి, నియోజకర్గ పరిశీలకుడు మొగసాల రెడ్డెప్ప, నాయకులు మొగసాల కృష్ణమూర్తి, భూపేష్‌ గోపీనాథ్‌, రెస్కో వైస్‌ చైర్మన్‌ కోదండరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు శ్రీనివాసులు, నితిన్‌రెడ్డి, పార్టీ మండల కన్వీనర్లు బుల్లెట్‌ దండపాణి, విజలాపురం బాబురెడ్డి, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు చంగప్ప, పెద్దన్న, కృష్ణమూర్తి, సుబ్బరాజు పాల్గొన్నారు.

కుప్పంలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేద్దాం

భరత్‌ను గెలిపించి ముఖ్యమంత్రికి కానుక ఇద్దాం

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement