అది పాము కళేబరం కాదు.. ప్లాస్టిక్‌

- - Sakshi

– ఐసీడీఎస్‌ పీడీ నాగశైలజ

చిత్తూరు: గర్భిణికి పంపిణీ చేసిన పౌష్టిక ఆహారంలోని ఎండు ఖర్జూజ ప్యాకెట్‌లో వచ్చింది పాము కళేబరం కాదని, అది ప్లాస్టిక్‌ అని ఐసీడీఎస్‌ పీడీ నాగశైలజ స్పష్టం చేశారు. మండలంలోని జంబువారిపల్లె పంచాయతీ శాంతినగర్‌ అంగన్‌ వాడీ కేంద్రంలో ప్రభుత్వం సరఫరా చేసిన పౌష్టిక ఆహారంలో పాము కళేబరం అంటూ బుధవారం పచ్చ పత్రికల్లో, చానళ్లలో వార్తలు ప్రచురితమైయ్యాయి. దాంతో ఐసీడీఎస్‌ పీడీ శాంతినగర్‌ అంగన్‌వాడీ కేంద్రంలో విచారణ చేపట్టారు. పౌష్టికాహారం అందుకున్న గర్భిణి మానసను విచారించారు.

ఈ నెల నాలుగో తేదీ పంపిణీ చేశారనీ, అందులో ఎండు ఖర్జూరం ఫ్యాకెట్‌ను మంగళవారం తెరిచినట్లు ఆమె తెలిపింది. అందులో పాము లాంటి వస్తువు ఉండడంతో ఈ విషయాన్ని అంగన్‌వాడీ కార్యకర్త జానకి దృష్టికి తీసుకు వెళ్లినట్లు పేర్కొంది. తరువాత ఎండు ఖర్జూరం ప్యాకెట్‌లో పాము లాంటి వస్తువును చేతిలోకి తీసుకుని కళేబరమా లేక ఇతర వస్తువేదైనా అని పరిశీలించారు. దాని వాసన చూశారు. చేతిలో పట్టుకుని గట్టిగా విరిచారు.

విరగక పోవడంతో పాము కళేబరం కాదని నిర్థారించారు. పీడీ మాట్లాడుతూ పాము కళేబరం ఐతే తునిగి ముక్కలుగా విరిగిపోయేదన్నారు. ప్యాకింగ్‌ సమయంలో ప్లాస్టిక్‌ లాంటి వస్తువు ఎండు ఖర్జూజంతో ఫ్యాక్‌ అయిందని అనుమానం వ్యక్తం చేశారు. ఫ్యాకెట్‌లో ఉన్న వస్తువు గట్టిగా అంగుళంపైగా ఉందని, అక్కడక్కడ పచ్చచుక్కలు కలిగి ఉందని, ల్యాబ్‌కు పంపుతామన్నారు. అంగన్‌వాడీ సిబ్బంది పరిశీలించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు. పాము కళేబరం ఫ్యాకెట్‌లో ఉంటే వాసన వచ్చేదన్నారు. పచ్చపత్రికలు ప్రభుత్వంపై బురద జల్లె ప్రయత్నం చేయడం గర్హనీయమని తెలిపారు.

Read latest Chittoor News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top