పెళ్లికొచ్చి.. ప్రాణాలు విడిచి!
● చెట్టును ఢీకొని ఇద్దరు తమిళనాడు యువకుల మృతి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): పెళ్లి కోసం వచ్చి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గురువారం రాత్రి చిత్తూరు మండలం, ఎ.జంగాలపల్లి వద్ద చోటుచేసుకుంది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన సోమశేఖర్ (21), ధనశేఖర్(21) పొన్నైలో జరిగిన ఓ పెళ్లి వేడుకకు వచ్చారు. ఆ తర్వాత ద్విచక్ర వాహనంపై మండలానికి వచ్చారు. ఈ క్రమంలో ఏ జంగాలపల్లి వద్ద చెట్టును ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతివేగంతో వచ్చి.. మలుపులో తిరగలేక చెట్టును ఢీకొట్టినట్టు తెలుస్తోంది. ఎందుకు మండలం మీదుగా వచ్చారనే విషయం తెలియరావడం లేదని ఎస్‌ఐ మణికంఠేశ్వరెడ్డి తెలిపారు.


