హృదయాలు స్పందించినా.. కరుణించని భగవంతుడు
నగరి : తీవ్ర అస్వస్థతకు లోనై చైన్నెలోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందుకున్న మండలంలోని తడుకు దళితవాడకు చెందిన విద్యార్థిని ప్రభావతి పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచింది. 20 రోజుల క్రితం చలాకిగా తిరుగిన విద్యార్థినిపై విధి పగబట్టింది. తీవ్ర అనారోగ్యం పాలై ఆస్పత్రిలో ప్రాణం కోసం పోరాడుతూ ఓడిపోయింది. ఆమె పరిస్థితిని వెలుగులోకి తెస్తూ ఈ నెల 11వ తేదీన సాక్షి దినపత్రికలో ‘ప్రభావతం..ప్రాణసంకటం’ అనే కథనం ప్రచురితమైంది. ఆ కథనానికి ప్రభుత్వం స్పందించకున్నా పలు దయార్ధ హృదయాలు స్పందించాయి. వారు సాయం అందించడంతో ఆమెకు చికిత్స కూడా అందుతూ వచ్చింది. ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగుపడుతూ వస్తోందని వైద్యులు తెలిపిన సమాచారం కుటుంబ సభ్యులకు ఎంతో భరోసాను ఇచ్చింది. ఈ తరుణంలో ఆకస్మికంగా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురై ప్రభావతి మరణించింది. ఆమె మృతదేహాన్ని శుక్రవారం మధ్యాహ్నం స్వగ్రామానికి తీసుకువచ్చారు. ఆమె చదివిన పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు బాలిక నివాసం వద్దకు పరుగులు తీశారు. కడసారి వీడ్కోలు పలుకుతూ తోటి విద్యార్థులు పెట్టిన కన్నీరు ప్రతి హృదయాన్నీ కదిలిచింది. తడుకు దళితవాడలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
హృదయాలు స్పందించినా.. కరుణించని భగవంతుడు


