కూటమిలో కుంపటి
సాక్షి టాస్క్‌ఫోర్స్ : నగరి మున్సిపల్ పరిధి అనంతప్పనాయుడు కండ్రిగలో బీజేపీ, టీడీపీ నేతల మధ్య గత కొంతకాలంగా ఉన్న వివాదాలు గురువారం రాత్రి గొడవలకు దారితీశాయి. రాత్రి ఆ రెండు పార్టీల నేతలు వీధిన పడి కొట్టుకున్నారు. ఈ గొడవల్లో ఒక మహిళకు గాయాలయ్యాయి. దానికి కారణం బీజేపీ పట్టణ అధ్యక్షుడు హరినే అంటూ టీడీపీ నేతలు మూకుమ్మడిగా అతని ఇంటిపై రాళ్లదాడికి దిగారు. కిటికీలు పగులగొట్టి ఇంటిని ధ్వంసం చేశారు. తమ సామాజిక వర్గానికి చెందిన బంధువు ఇంటిపై దాడి జరుగుతుండడంతో స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలు అతనికి అండగా వెళ్లారు. ఇదే అదునుగా టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ నేతలపైనా దాడి చేశారు. ఈ గొడవలు పార్టీలను పక్కన నెట్టి రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణలుగా మారిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపుచేసినా టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై బీజేపీ పట్టణ అధ్యక్షుడిని అరెస్టు చేశారు. దీనిపై వైఎస్సార్‌సీపీ నేతలు మాట్లాడుతూ గ్రామంలో తమవి కొన్ని నివాసాలే ఉన్నాయని, టీడీపీకి చెందిన వారివి ఎక్కువ ఉన్నాయన్నారు. పెరడు స్థలాలు, కొబ్బరి చెట్ల సమస్య అంటూ తరచూ టీడీపీ నేతలు తమపై దాడికి దిగుతున్నారన్నారు. ఇప్పటికే పలు మార్లు ఇలా గొడవలు జరిగాయన్నారు. పోలీసులు కూడా టీడీపీ నేతలను అదుపుచేయలేక పోయారన్నారు. ఉదయం ఇళ్ల ముందు ఉన్న కొబ్బరి చెట్లను టీడీపీ నేతలు నరికేసినా పట్టించుకోలేదని చెప్పారు. మహిళలపై కూడా చేయి చేసుకున్నారన్నారు. ఓ సామాజిక వర్గానికి చెందిన గ్రామంలో ఉండకూడని టీడీపీ నేతలు హుకుం జారీ చేస్తున్నారని, ఆ సామాజిక వర్గానికి చెందిన స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
కూటమిలో కుంపటి


