
ఓవల్ టెస్ట్‌లో భారత్ పట్టు సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే భారత్ మరో 9 వికెట్లు తీయాలి. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది. ఇదే మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలవాలంటే మరో 324 పరుగులు చేయాలి. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోయి 50 పరుగులు చేసింది. బెన్ డకెట్ 34 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. సిరాజ్ అద్బుతమైన బంతిలో జాక్ క్రాలేను (14) క్లీన్ బౌల్డ్ చేశాడు.
క్రాలే వికెట్‌తో సిరాజ్ ఓ అరుదైన ఘనత సాధించాడు. విదేశీ టెస్ట్‌ల్లో సిరాజ్ 100 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఈ మైలురాయిని సిరాజ్ కేవలం 27 టెస్ట్‌ల్లో తాకాడు. టెస్ట్ కెరీర్‌లో మొత్తంగా 119 వికెట్లు తీసిన సిరాజ్ విదేశాల్లోనే సింహభాగం వికెట్లు తీసి ఓవర్సీస్ మొనగాడనిపించుకున్నాడు. సిరాజ్ స్వదేశంలో కేవలం 19 వికెట్లు (14 మ్యాచ్‌ల్లో) సాధించాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగులు చేసి ఇంగ్లండ్‌కు 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (118) సెంచరీతో కదంతొక్కగా.. ఆకాశ్‌దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు.
అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (64), హ్యారీ బ్రూక్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 4 వికెట్లు తీశారు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో కరుణ్ నాయర్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకపడి ఉంది.