
జూలైలో మైనస్ 0.58 శాతం
ఇది రెండేళ్ల కనిష్ట స్థాయి
న్యూఢిల్లీ: టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం రెండేళ్ల కనిష్ట స్థాయికి దిగొచి్చంది. జూలైలో మైనస్ 0.58 శాతంగా (ప్రతి ద్రవ్యోల్బణం) నమోదైంది. జూన్‌లోనూ ఇది మైనస్ 0.13 శాతంగా ఉంది. గతేడాది జూలైలో 2.10 శాతంగా ఉండడం గమనార్హం. ఆహార వస్తువులు, మినరల్ ఆయిల్, ముడి చమురు, సహజ వాయువు, బేసిక్ మెటల్స్ ధరలు తగ్గడం వల్ల జూలై నెలకు టోకు ద్రవ్యోల్బణం ప్రతికూలంగా నమోదైనట్టు పరిశ్రమల శాఖ పేర్కొంది.
→ ఆహార వస్తు విభాగంలో టోకు ద్రవ్యోల్బణం మైనస్ 6.29%గా నమోదైంది. జూన్‌లో మైనస్ 3.75%గా ఉంది. ముఖ్యంగా ఈ విభాగంలో కూరగాయల ధరలు గణనీయంగా తగ్గడంతో ద్రవ్యోల్బణం మైనస్ 28.96 శాతంగా నమోదైంది.
→ ఇంధనం, విద్యుత్ విభాగంలో మైనస్ 2.43 శాతంగా ఉంది.
→ తయారీ వస్తు విభాగంలో ద్రవ్యోల్బణం 2.05 శాతానికి పెరిగింది. జూన్‌లో ఇది 1.97%.
ఆగస్ట్‌లో మళ్లీ ప్లస్‌లోకి..
‘‘ఆహార విభాగం కారణంగానే జూలైలో టోకు ద్రవ్యోల్బణం మైనస్‌లో కొనసాగింది. కూరగాయలు, పప్పులు, గుడ్లు, మాంసం, చేపల ధరలు ఎక్కువగా తగ్గాయి. వినియోగ ధరల (రిటైల్) ద్రవ్యోల్బణం లాగే టోకు ద్రవ్యోల్బణం సైతం జూలైలో కనిష్టానికి చేరింది. ఆగస్ట్ నుంచి తిరిగి ప్లస్‌లోకి చేరుకుంటుంది’’ అని ఇక్రా సీనియర్ ఆర్థికవేత్త రాహుల్ అగర్వాల్ తెలిపారు.